స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ల పై ఈరోజు హైకోర్టు లో వాదనలు జరిగాయి. కాగా.. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పును మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. కాగా.. స్కిల్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో.. చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అయితే.. చంద్రబాబు రెండో కంటికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించినట్టు న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు వెంటనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించగా.. ఆయన కూడా చంద్రబాబు ఆరోగ్యపరమైన అంశాలనే ప్రస్తావించారు. చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తిగా విన్న ధర్మాసనం.. మధ్యాహ్న భోజన విరామం తర్వాత ప్రభుత్వం తరఫు వాదనలు కూడా విన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. తీర్వును రేపు వెల్లడించనున్నట్టు తెలిపింది. మరోవైపు.. చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సమయం కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టును కోరారు. దీంతో.. రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ మీద వాదనలు ఎప్పుడనేది కూడా మంగళవారమే నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది.