స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి బయలుదేరి సుదీర్ఘ ప్రయాణం తరువాత ఈరోజు (బుధవారం) ఉదయం 6 గంటలకు ఉండవల్లిలోని ఇంటికి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు టీడీపీ అధినేత విశ్రాంతిలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం 12 గంటలు తరువాత ఏ క్షణంలోనైనా హైదరాబాద్‌కు బయలుదేరే అవకాశం ఉంది. అయితే హైకోర్ట్ ఆదేశాల మేరకు చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలను ఎవరిని కలవరనీ ఇప్పటికే ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటించారు. కార్యకర్తలు, నేతలు ఎవరు ఇంటికి రావద్దని అచ్చెన్న విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తిరుపతి పర్యటనను ఇప్పటికే రద్దు చేసుకున్నట్టు ప్రకటన వెలువడింది. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం తిరుమల వెళ్లాలని.. గురువారం శ్రీవారి దర్శనం అనంతరం హైదరాబాద్ చేరుకోవాలని తొలుత భావించారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలకు తక్షణమే వైద్య చికిత్సలు చేయాల్సి ఉందని.. తిరుమల వెళ్లకపోవడం మంచిదని వైద్యులు సూచించారు. దాంతో ఆయన అటు ప్రయాణం మానుకున్నారు. బుధవారం మధ్యాహ్నం రోడ్డుమార్గంలో హైదరాబాద్ వెళ్లనున్నారు. ఈరోజు హైదరాబాద్ వెళ్లి వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. హైదరాబద్ నుంచి వ్యక్తిగత వైద్యులు కూడా చంద్రబాబును వెంటనే హైదరాబద్‌కు తీసుకురావాలని కుటుంబ సభ్యులకు సూచించారు.