తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. ఇవాళ భక్తుల రద్దీ భారీగా తగ్గింది.. భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను నేరుగా క్యూ లైన్‌లోకి అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి గంట సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని 62,269 మంది భక్తులు దర్శించుకున్నారు.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.19 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. స్వామివారికి 19,255 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
నవంబరులో టీటీడీ స్థానికాలయాల్లో విశేష ఉత్సవాలు ఇలా ఉన్నాయి. నవంబరు 5 నుంచి 14వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ తిరుమలనంబి ఉత్సవాలు జరగనున్నాయి. నవంబరు 7 నుంచి 16వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ మనవాళ మహాముని సాలకట్ల ఉత్సవం నిర్వహిస్తారు. నవంబరు 9 నుంచి 11వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
నవంబరు 10 నుంచి 18వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవంబరు 19న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం.. తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో స్కంద షష్టి ఉత్సవం ఉంటుంది. నవంబరు 26న శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం.. నవంబరు 30న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షబిల్వార్చన నిర్వహిస్తారు.