టీడీపీ అధినేత చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ ద్వారా అవినీతికి పాల్పడ్డారంటూ రాష్ట్ర భూగర్భ, గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ ఈ నెల ఒకటో తేదీన ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఇప్పటికే చంద్రబాబుపై ఐదు కేసులు ఉండగా, ఇది ఆరో కేసు. ఎఫ్‌ఐఆర్ నం. 19/2023తో ఐపీసీ సెక్షన్లు 120(బీ), 409 ఆర్/డబ్ల్యూ 34, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(డీ) రెడ్ విత్ సెక్షన్ 13(2) కింద కేసు నమోదు చేసింది. అప్పటి మంత్రి పీతల సుజాతను మొదటి నిందితురాలి(ఏ-1)గా చేర్చారు. ఏ-2గా నాటిీ సీఎం చంద్రబాబు, ఏ-3, ఏ-4గా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులను చేర్చింది. 2016 జనవరి 15న ఇసుక పాలసీని సవరిస్తూ చేస్తూ ఆదేశాలిచ్చారు. అనంతరం మా ర్చి 2 నుంచి ఉచిత ఇసుకకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్ 6న దానికి సంబంధించి జీవో 43ను విడుదల చేసింది. అయితే ఉచిత ఇసుక విధానానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ రెండు నెలల మధ్య కాలంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. దీంతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లింది. రావలసిన ఆదాయానికి గండిపడింది. ఇది ప్రభుత్వానికి నేరుగా నష్టం తెచ్చిన విధానం. దీనిపై విచారణ జరపాల్సిన అవసరముంది. ఈ విధానంతో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు కొద్ది మంది అధికార పార్టీ నేతల చేతిలోకి వెళ్లాయి. వారికి దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతోంది. ఎన్‌జీటీ మార్గదర్శకాలను ధిక్కరించి పెద్దఎత్తున తవ్వకాలు చేపట్టారు. ఉచిత పాల సీ, అమలు, జరిగిన అక్రమాలు, నిర్ణయాలు తీసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని మైనింగ్ డైరెక్టర్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐడీ తెలిపింది.