ఏపీలో టీడీపీ, జనసేన కూటమి ఎన్నికలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్... చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై పరామర్శించి, ఆపై చర్చలు జరిపారు. ఈ సమావేశం దాదాపు రెండున్నర గంటల పాటు జరిగింది. పొత్తు నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో కోసం షణ్ముఖ వ్యూహం పేరుతో పవన్ 6 అంశాలను ప్రతిపాదించారు.
1. అమరావతి రాజధానిగా కొనసాగింపు... విశాఖ, తిరుపతి, విజయవాడను క్లస్టర్ల వారీగా మహానగరాలుగా అభివృద్ధి
2. సంపన్న ఏపీ పేరిట వివిధ రంగాలకు ఆర్థిక ప్రోత్సాహం... వ్యవసాయం-బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు. చిన్న నీటి పారుదల రంగాన్ని ప్రోత్సహించడం.
3. మన ఏపీ-మన ఉద్యోగాలు పేరిట ఏటా పోస్టుల భర్తీ ప్రక్రియ. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు.
4. చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలకు రూ.10 లక్షల సాయం. చిన్న పరిశ్రమలకు చేయూతతో ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక... ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం
5. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు చేయూత
6. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఇళ్లకు ఉచితంగా ఇసుక పంపిణీ