పేదలకు ఉచిత రేషన్ పంపిణీ పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ పథకాన్ని మరో ఐదేళ్ల వరకూ కొనసాగించనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం (పీఎంజీకేఏవై) మరో ఐదేళ్లు కొనసాగుతుందని స్పష్టం చేశారు. వచ్చే డిసెంబరుతో ఈ పథకం గడువు ముగియనున్న విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పథకం పొడిగింపుపై ప్రధాని ప్రకటించారు. దీని వల్ల 80 కోట్ల మంది ప్రజలకు లబ్ది చేకూరనుంది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సమయంలో పీఎంజీకేఏవై పథకాన్ని 2020 మార్చిలో కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద పేదలకు ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. కరోనా లాక్‌డౌన్ తర్వాత పేదలను ఆదుకోవడం కోసం, వారి జీవనోపాధికి ఆసరాగా నిలించేందుకు ఈ పథకాన్ని కేంద్రం ఆవిష్కరించింది. ఈ స్కీమ్ కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్దిదారులందరికీ నెలకు ఉచితంగా ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యాలను అందిస్తోంది. ఈ ఆహార ధాన్యాలు ఎన్ఎఫ్ఎస్ఏ కింద తప్పనిసరిగా ఇవ్వాల్సినతో పాటు అదనం.
పీఎంజీకేఏవై ఆత్మనిర్భర్ భారత్‌లో ఒక భాగం.. ఫేజ్ 1, 2లను ఏప్రిల్ 2020 నుంచి నవంబర్ 2020 వరకు అమలు చేశారు. ఆ తర్వాత మూడో దశను మే నుంచి జూన్ 2021 వరకు పొడిగించారు. నాలుగో దశ జూలై నుంచి నవంబర్ 2021 వరకు.. ఐదో దశ మార్చి 2022 వరకు, ఆరో దశ డిసెంబరు 22 వరకూ, ఏడో దశ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ పథకానికి అయ్యే ఖర్చును రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రమే భరిస్తోంది. ఇక, ఎన్నికల ప్రచారం కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం దేశంలోని పేదలను కాంగ్రెస్ మానసికంగా తారుమారు చేసిందని ప్రధాని ఆరోపించారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన 'గరీబీ హఠావో' నినాదాన్ని ఓట్ల కోసం పేదల భావోద్వేగాలను ఉపయోగించుకుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు పేదరిక నిర్మూలనకే తాము అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం... పేదరికాన్ని నిర్మూలించేందుకు 'గరీబ్ కళ్యాణ్ అన్న యోజన'ని ప్రవేశపెట్టి, 13.5 కోట్ల మందిని విజయవంతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చాం. మాకు పేదలే పెద్ద సమూహం. దీంతో పలు రాజకీయ పార్టీలు అసౌకర్యానికి గురయ్యాయి. పేదలు మోదీతో ఎలా స్నేహం చేస్తారని వారు ఆశ్చర్యపోతున్నారు.. దీంతో కొత్త ఆటను ప్రారంభించారు.. అదే కులతత్వం’ మోదీ విమర్శించారు. గత ఐదేళ్లుగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయలేదని దుయ్యబట్టారు. పేదలకు ఇళ్లు, 100 కంటే ఎక్కువ జన్ ఔషధి కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిందని ధ్వజమెత్తారు.