దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ బస్సు బీభత్సం బీభత్సం సృష్టించింది. రోహిణ ఏరియాలో వేగంగా వచ్చిన ఓ ఎలక్ట్రిక్ బస్సు.. ముందు ఓ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కారును ఢీకొన్న అనంతరం కూడా బస్సు వేగం తగ్గలేదు. అది అదుపు తప్పి ఓ ఈ-రిక్షాను ఢీ కొట్టి.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న 9 ద్విచక్రవాహనాలపై దూసుకుపోయింది. దీంతో ఆ వాహనాలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. ప్రయాణికులను దింపి.. డ్యూటీ ముగిసిన అనంతరం డిపోకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, డ్రైవర్కు మూర్చ రావడం వల్లే ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. డ్రైవర్కు మూర్చ రావడం వల్లేనా? లేదా మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారును ఢీకొట్టిన తర్వాత ఈ-రిక్షా, బైక్‌లపైకి దూసుకెళ్లడం సీసీటీవీలో రికార్డయ్యింది. ద్విచక్రవాహనాల పక్కన ఉన్నవారు హడలెత్తిపోయి భయంతో పరుగులు తీశారు.
బస్సు ఢీకొట్టిన కారులోని వ్యక్తి ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గత నెలలో కూడా డీటీసీ బస్సు ఢీకొట్టి 36 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తూర్పు ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో తొలుత రెండు ఈ-రిక్షాలను ఢీకొట్టిన బస్సు అనంతరం పండ్ల బండిపైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనం వదిలి పరారవ్వగా.. పోలీసులు తర్వాత అతడ్ని అరెస్ట్ చేశారు. కాగా, గత మార్చిలోనూ పృథ్వీరాజ్ రోడ్‌లో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. క్రిస్టియన్ శ్మశానవాటిక కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టిన అనంతరం లోపలికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ, ఈ బీభత్సానికి శ్మశానంలోని సమాధులు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును బయటకు తీసి అక్కడ నుంచి తరలించారు.