ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే తొలి విడత ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందే మేనిఫేస్టోను విడుదల చేసింది. భరోసా కా ఘోషనా పాత్ర 2023-2028 పేరుతో.. ఛత్తీస్‌గఢ్‌లోని ఆరు ప్రాంతాల నుంచి మేనిఫేస్టోను విడుదల చేశారు. ఇక రాష్ట్రంలో కులగణన, వరి పంటకు రూ.3200 మద్దతు ధర, రైతులకు రుణమాఫీ, వంటగ్యాస్‌పై రూ.500 సబ్సిడీ సహా అనేక అంశాలను మేనిఫేస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చింది. అయితే తొలి విడత పోలింగ్ ప్రచార పర్వం ముగియడానికి కొన్ని గంటల ముందు ఈ మేనిఫేస్టే విడుదలైంది.
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తీసుకువస్తే కులగణన జరిపిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇక గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్న వారికి నేరుగా రూ.500 అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. 'భరోసా కా ఘోషనా పాత్ర 2023-2028' పేరుతో ఆదివారం కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. రాయపూర్, జగదల్‌పూర్, బిలాస్‌పూర్, అంబికాపూర్, కవర్దాల్లో ఈ మేనిఫెస్టో విడుదల చేయగా, రాజ్‌నంద్‌గావ్‌లో సీఎం భూపేశ్ బఘేల్, రాయపూర్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కుమారి సెల్జా విడుదల చేశారు.
ఇక ఛత్తీస్‌గఢ్‌లో కులాల వారీగా లెక్కలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు. ఎకరాకు 20 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుందని పేర్కొన్నారు. రైతులకు క్వింటాల్ వరి ధాన్యానికి రూ.3,200 చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇక ధాన్యం పండించే వారికి రాజీవ్ గాంధీ న్యాయ్ యోజన కింద ఇన్‌పుట్ సబ్సిడీ ప్రస్తుతం ఇస్తున్నామని తెలిపారు. దాన్ని ప్రస్తుతం రూ.4 వేలు ఇస్తుండగా.. రూ.6 వేలకు పెంచుతామని తెలిపారు. దీనికి అదనంగా టెండు లీఫ్ కలెక్టర్లకు వార్షికంగా రూ.4 వేల బోనస్ ఇస్తామని ప్రకటించారు.
'మహతరి న్యాయ్ యోజన్' తల్లులు, అక్కాచెల్లెల్ల కోసం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పథకం అన్ని ఆదాయ వర్గాల మహిళలు వంటగ్యాస్ బుక్ చేసుకుంటే వారి ఖాతాల్లోకి రూ.500 చొప్పున సబ్సిడీ డబ్బులు వేస్తామని తెలిపారు. కాగా ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఎన్నికలు నవంబర్ 7 వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ప్రచార పర్వం ముగిసింది. ఇక రెండో విడత పోలింగ్ నవంబర్ 17 వ తేదీన నిర్వహించనుండగా.. ఫలితాలు ఐదు రాష్ట్రాలతోపాటు డిసెంబర్ 3 వ తేదీన వెలువడనున్నాయి.