ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండటం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో వాయు నాణ్యత సూచీలు రోజు రోజుకూ క్షీణిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే పరిస్థితి మరింత దిగజారకుండా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించకుండా నాలుగో దశలో భాగంగా కఠిన ఆంక్షలను విధించింది. అత్యవసర సేవలు అందించే వాహనాలు మినహా కాలుష్యానికి కారణం అయ్యే మిగితా ట్రక్కులు ఏవీ రాకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఫోర్ వీల్ కమర్షియల్ వాహనాలు కూడా దేశ రాజధాని పరిధిలోకి అనుమతించమని స్పష్టం చేసింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే సీఎన్జీ, ఎలక్ట్రిక్, బీఎస్ VI వాహనాలను మాత్రమే ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోకి అనుమతించాలని పేర్కొంది.
వీటితోపాటు దేశ రాజధాని పరిధిలోని ప్రాంతాల్లో నిర్మాణాలు, కూల్చివేతలు పూర్తిగా ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఓవర్‌బ్రిడ్జ్‌లు, పవర్ ట్రాన్స్‌మిషన్, పైప్‌లైన్‌లు వంటి ప్రజా సంబంధ ప్రాజెక్ట్‌లతో పాటు అన్ని రకాల నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించింది. వీటితోపాటు వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన అన్ని అత్యవసర చర్యలు అమలు చేయాలని ఢిల్లీతోపాటు ఎన్‌సీఆర్ పరిధిలోని రాష్ట్రాలను కోరింది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాలని నిబంధనలు పెట్టింది. మిగతా 50 శాతం మంది సిబ్బంది వర్క్ ఫ్రం హోమ్ చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా కంపెనీలకు సూచించింది. ఇక ఢిల్లీ పరిధిలోని ప్రైమరీ స్కూళ్లకు మరో ఐదు రోజుల పాటు సెలవులను పొడిగించింది. మొదట నవంబర్ 5 వ తేదీ వరకే సెలవులు ప్రకటించగా.. ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గకపోవడం కాకుండా పెరగడంతో సెలవులను పొడిగించినట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక హైస్కూల్ పాఠశాలలు మూసివేయాల్సిన అవసరం లేదని.. ఒకవేళ అవసరమైతే ఆన్‌లైన్ తరగతులు నిర్వహించుకోవాలని సూచించింది. ఇక స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్ గ్రూపు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్‌కు చెందిన 3 నగరాలు టాప్-10 లో ఉన్నాయి. ఇక మొదటి స్థానంలో ఢిల్లీ ఉండటం పరిస్థితిని తెలుపుతుంది. ఈ అత్యంత కాలుష్య నగరాల జాబితాలో మూడో స్థానంలో కోల్‌కతా, ఆరో స్థానంలో ముంబై ఉన్నాయి.ఈ జాబితా చూస్తే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం అవుతోంది.