అసెంబ్లీ పోలింగ్‌కు ఒక రోజు ముందు ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బాంబు పేలుడు సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం.. ఎలక్షన్ సిబ్బంది, సామాగ్రిని తరలిస్తోంది. ఈ క్రమంలోనే బాంబు పేలడంతో ముగ్గురు ఎన్నికల సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు ఇచ్చిన హెచ్చరికలతో అప్రమత్తమైన ఎన్నికల సంఘం.. ఛత్తీస్‌గఢ్‌లో భారీగా బలగాలను మోహరించింది. ముఖ్యంగా బస్తర్ డివిజన్ పరిధిలో ఉన్న 12 నియోజక వర్గాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పేలుడు సంభవించడం తీవ్ర చర్చనీయాశంగా మారింది.
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో ఈ ఐఈడీ బాంబు పేలింది. కాంకేర్ జిల్లాలోని మార్బెడ నుంచి రెంగాఘటి రెంగగొండి పోలింగ్ స్టేషన్‌కు ఎన్నికల సిబ్బంది, భద్రతా బలగాలు వెళ్తుండగా ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్, ఇద్దరు పోలింగ్ టీమ్ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను ప్రకాష్ చంద్‌గా గుర్తించారు. అతన్ని మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు సిబ్బందికి కూడా చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారు ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు.
ఇక బస్తర్ డివిజన్ పరిధిలో ఉన్న 12 నియోజకవర్గాల్లో మావోయిస్ట్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ 12 స్థానాల్లో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు విధించారు. మొత్తం 5304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో 600 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ హెచ్చరికల నేపథ్యంలో డ్రోన్లు, హెలికాప్టర్లతో వారి కదలికలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. నవంబర్ 7, 17 వ తేదీల్లో పోలింగ్ జరగనున్నాయి. డిసెంబర్ 3 వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.