సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లో పోలీసులకు ఆదేశాలిచ్చి అక్రమంగా టీడీపీ నేతలని నిర్బంధించారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. కరువు జిల్లా అనంతపురం రైతాంగం తరపున మాట్లాడడమే తాము చేసిన నేరమా అని ప్రశ్నించారు. ఈ నాలుగున్నర సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రాజెక్టులన్నీ నిలిపివేసి రాయలసీమ గొంతు కోసిన ముఖ్యమంత్రి జగన్ అని విమర్శించారు. రాయలసీమను సమాధి కట్టిన ద్రోహి జగన్ అని అన్నారు. జిల్లా భవిష్యత్తు గొంతు కోసి తులసి తీర్థం పోసేందుకు వస్తున్న జిల్లా అల్లుడు ఈ ముఖ్యమంత్రి అంటూ విరుచుకుపడ్డారు. తమను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసినట్లే అని చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లా భవిష్యత్ మార్చే చర్యలు టీడీపీ హయాంలో త్రాగునీటి ప్రాజెక్టులో, కియా పరిశ్రమ, వేలకోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేసింది వీటన్నిటినీ నాశనం చేసే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తోందని కాలవ శ్రీనివాసులు విమర్శలు గుప్పించింది.