తెలంగాణ ,నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం రాత్రి కన్నా తల్లిని వైకుంఠధామంలో వదిలేసిన ఒక కసాయి కొడుకు బాగోతం బయటపడ్డింది. వివరాల్లోకి వెళ్ళితే.... బాధితురాలు.. ఏపీ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వాస్తవ్యురాలు చింతకాయల వెంకటరత్నమ్మ! ఆమెకు కుమారుడు వెంకటేశ్వర్లు, కూతురు తిరుపతమ్మ ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. వెంకటేశ్వర్లు కూలీ పనులకు వెళుతుంటాడు. చాన్నాళ్లుగా వెంకటరత్నమ్మ వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. వెంకటేశ్వర్లు, అతడి భార్య కలిసి శుక్రవారం రాత్రి వెంకటరత్నమ్మను ఆటోలో ఎక్కించుకొని మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండాలోని వైకుంఠధామంలో వదిలేశారు. ఆమె.. దీనంగా కొడుకా వెంకటేశ్వర్లూ అని బిగ్గరగా ఏడుస్తున్నా కనికరించకుండా స్థానికులెవరైనా చూస్తారేమోనన్న కంగారుతో భార్య కలిసి వృద్ధురాలిని దారుణంగా కొట్టాడు. ఆపై ఇద్దరూ కలిసి ఆమె రెండు చేతులూ వెనక్కి విరిచి వెళ్లిపోయారు. రాత్రంతా వెంకటరత్నమ్మ వైకుంఠదామంలో చిమ్మచీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది. సోమవారం ఉదయం గ్రామపంచాయతీ సిబ్బంది మొక్కలకు నీళ్లు పోసేందుకు అక్కడికి వెళ్లగా వృద్ధురాలు కనిపించింది. గ్రామ సర్పంచ్‌కు సమాచారమివ్వగా ఆయన వెంటనే మిర్యాలగూడ రూరల్ పోలీసులకు చెప్పారు. పోలీసులతో పాటు నల్లగొండ జిల్లా కలెక్టర్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ పీడీ ఆదేశాల మేరకు ఫీల్డ్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వృద్ధురాలికి ఫిట్స్ వస్తుండటంతో వెంటనే మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలందించారు. మిర్యాలగూడ రూరల్ పోలీసులు, వెంకటరత్నమ్మ కుమారుడు వెంకటేశ్వర్లును పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిని జాగ్రత్తగా చూసుకుంటానని అతడి చేత లిఖితపూర్వకంగా బాండ్ పేపర్ రాయించుకున్నారు.