లైంగిక వేధింపులకు సంబంధించిన ఓ కేసును విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. పోక్సో చట్టంపై కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డ వారికి విధించే పోక్సో చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మైనర్‌ను సాధారణంగా తాకడం లైంగిక నేరం కాదని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. మైనర్ల శరీరాన్ని సాధారణంగా తాకడం అనేది తీవ్రమైన లైంగిక నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఓ ట్యూషన్ పాయింట్‌లో 6 ఏళ్ల బాలికపై ఆ ట్యూషన్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పోక్సో చట్టం కింద నమోదైన కేసులో ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ అమిత్ బన్సల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలిక ప్రైవేట్ పార్ట్‌లను ఆ ఉపాధ్యాయుడు తాకినందున.. ఆ నిందితుడిని తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక నేరానికి పాల్పడినట్లు దోషిగా తేల్చలేమని పేర్కొన్నారు. ఈ కేసులో ఆ ఉపాధ్యాయుడికి శిక్ష విధించేందుకు ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా నిరాకరించింది. ఈ క్రమంలోనే ఈ కేసులో కింది కోర్టు విధించిన జైలు శిక్ష, జరిమానాపై జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
అయితే ఈ కేసులో పోక్సో చట్టం ప్రకారం ఆ నిందితుడిని తీవ్రమైన లైంగిక నేరానికి పాల్పడినట్లు కింది కోర్టు నిర్ధారించింది. దీంతో ఆ వ్యక్తికి జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. అయితే ఈ జైలు శిక్ష, జరిమానాను తగ్గించడం గానీ.. తొలగించడం గానీ చేయడానికి ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ అమిత్ బన్సల్ నిరాకరించారు. 2020 లో ఈ కేసులో నిందితుడిని ఐపీసీ సెక్షన్ 376.. పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కింది కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో పోక్సో చట్టంలోని సెక్షన్ 10 కింద అతడికి ఐదేళ్ల జైలు శిక్ష.. రూ.5 వేల జరిమానా వేసింది. అయితే ఆ నిందితుడు కింది కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశాడు. ఈ క్రమంలోనే పోక్సో చట్టం కింద మైనర్ల శరీర భాగాలను సాధారణంగా తాకడం అనేది లైంగిక నేరం కిందికి రాదని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడి శిక్షను, జరిమానాను ఢిల్లీ హైకోర్టు సమర్థించడం గమనార్హం.