సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న ప్రముఖ నటి రష్మిక మందన్న వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వీడియోలో ఆమె డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్ లోకి వచ్చినట్లు మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేశారు. తాజాగా, ఈ వీడియోపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు అత్యంత ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించిన కేంద్రం.. మార్ఫింగ్ వీడియోలను కట్టడి చేయాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమాలదేనని స్పష్టం చేసింది. డీప్‌ఫేక్‌లను వీడియోలను సృష్టించి, సర్క్యులేషన్ చేస్తే చట్టపరంగా చర్యలు, జరిమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది.
‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 66D ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా మోసం చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధించబడుతుంది’ అని పేర్కొంది. అలాగే, గత ఏప్రిల్‌లో జారీ చేసిన ఐటీ నిబంధల ప్రకారం.. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు చట్ట పరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుందని సోమవారం కేంద్ర ఐటీ ప్రసార శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఏ వినియోగదారు కూడా తమ అకౌంట్ నుంచి నకిలీ లేదంటే తప్పుడు సమాచారాన్ని పోస్టు చేయకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.
ఒకవేళ తప్పుడు సమాచారాన్ని పోస్టు చేసినా, దాన్ని 36 గంటల్లోగా తొలగించాలని, ఈ నింబధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. మార్ఫింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించిన ఆయన.. ఈ సమస్యను సామాజిక మాధ్యమ నెట్‌వర్కింగ్ సైట్లే పరిష్కరించాలని తేల్చి చెప్పారు. ఇక, గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న రష్మిక ఫేక్ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే, ఈ వీడియో నిజం కాదని ఒరిజినల్ వీడియోను, నకిలీలను ఆయన పోస్టు చేశారు. వాస్తవానికి ఈ వీడియో బ్రిటిష్-ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్ జరా పటేల్ అనే యువతిదని ఆయన చెప్పారు. ఆ అమ్మాయి ఫేస్‌ను ఎడిట్ చేసి రష్మిక ముఖాన్ని పెట్టారని తెలిపారు.