చొరబాటుదారుల ఉచ్చులో చిక్కుకున్న మణిపుర్ పోలీసులను ఇండియన్ ఆర్మీకి చెందిన అస్సాం రైఫిల్స్ బృందం సాహసోపేతంగా కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మయన్మార్‌కు సమీపంలో ఉండే తెంగ్నౌపాల్ జిల్లాలోని ఇంఫాల్ - మోరే హైవేపై ఈ ఘటన జరిగింది. ఈ ఏడాది మార్చి నుంచి అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో కొన్ని రోజుల కిందట మళ్లీ అలజడి రేగిన సంగతి తెలిసిందే. ఓ పోలీసు అధికారి దారుణ హత్య ఘటన అనంతరం.. అదనపు బలగాలను మోహరించారు. అక్టోబరు 31న మణిపూర్ పోలీస్ కమాండోల కాన్వాయ్ మోరే వైపు వెళ్తుండగా.. కొండలపై దాక్కున్న చొరబాటుదారులు మెరుపుదాడి చేశారు.
పోలీస్ కమాండోల వాహనాలు హైవేలోని ఓ మూలమలుపు వద్దకు రాగానే కొండల పైనుంచి ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. వ్యూహాత్మక ప్రాంతంలో దాడి చేయడంతో.. పోలీసులు ఎదురుదాడి చేయడంలో వెనుకబడ్డారు. వాహనాల నుంచి దిగి కొండల మాటున దాక్కొని ఎదురుకాల్పులు ప్రారంభించారు. బుల్లెట్ల గాయాలతో రక్తమోడుతూ చొరబాటుదారులను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు పోలీసు కమాండోలు. వారి శక్తి సరిపోవడంలేదు. సరిగ్గా అప్పుడే అస్సాం రైఫిల్స్ బృందం అటుగా వచ్చింది. చొరబాటుదారుల ట్రాప్‌లో చిక్కుకున్న పోలీసులను గుర్తించి, తక్షణం స్పందించింది.
ఓ వైపు కొండల పైనుంచి బుల్లెట్లు దూసుకొస్తుంటే.. ఆ దాడిని తిప్పికొడుతూనే డేరింగ్ ఆపరేషన్ చేపట్టారు. అక్కడ చిక్కుకుపోయిన పోలీసులను సాహసోపేతంగా ఆర్మీ వాహనంలోకి ఎక్కించుకొని, వారిని తీసుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. చొరబాటుదారుల దాడిలో ముగ్గురు పోలీస్ కమాండోలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. డిఫెన్స్ కోర్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్సాం రైఫిల్స్ కమాండోలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మోరే ప్రాంతంలో హెలిపాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న సబ్ డివిజనల్ అధికారి చింగ్తం ఆనంద్‌ను చొరబాటుదారులు స్నైపర్ రైఫిల్‌తో కాల్చి చంపేశారు. ఈ ఘటన అనంతరం మణిపూర్ మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. మెయితి, కుకీ తెగల మధ్య మళ్లీ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మోరే ప్రాంతానికి అదనపు బలగాలను తరలించి భద్రత కట్టుదిట్టం చేశారు.