ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ వాయు కాలుష్యంపై పలు పిటిషన్లు దాఖలు,,,,కేంద్రానికి ముఖ్యమైన సూచనలు చేసిన కోర్టు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2023, 10:07 PM

ఢిల్లీలో వాయు కాలుష్యం రాజకీయ యుద్ధంగా మారకూడదని, ఉక్కిరిబిక్కిరి చేస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యం దెబ్బతీయడానికి కారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలో పంట వ్యర్ధాలను తగులబెట్టడం ప్రతి శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరగడానికి ముఖ్య కారణమని కోర్టు పునరుద్ఘాటించింది. వ్యర్థాల దగ్ధాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ఇది ఆపివేయాలని మేము కోరుకుంటున్నాం... మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు.. ఇది మీ పని. అయితే ఇది నిలిచిపోవాలి... వెంటనే ఏదో ఒకటి చేయాలి’ అని కోర్టు పంజాబ్ ప్రభుత్వ న్యాయవాదికి తెలిపింది. అనంతరం జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిన్ సుధాన్షు ధులియాల ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.


అలాగే, పంట వ్యర్ధాల దహనంపై ఢిల్లీ సహా పాటు చుట్టుపక్కల ఉన్న ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలతో సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రానికి సూచించింది. ఢిల్లీ కాలుష్యానికి ముఖ్యమైన కారకాల్లో ఒకటైన వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలపై దృష్టి పెట్టాలని సూచించింది. గత కొన్ని రోజులుగా 'తీవ్ర' కేటగిరీలో ఉన్న దేశ రాజధానిలో విషపూరిత గాలి నాణ్యతపై దాఖలైన వ్యాజ్యాన్ని కోర్టు విచారిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు డేటా ప్రకారం.. ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో వాయు నాణ్యత సూచీ 400 కంటే ఎక్కువ ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణానికి 80 రెట్లు అధికం.


పిటిషనర్‌ తరఫు న్యాయవాది అపరాజితా సింగ్‌ మాట్లాడుతూ.. పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. ఢిల్లీలోని గాలి నాణ్యత తగ్గిపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఆమె అన్నారు. ‘వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్, రాష్ట్రాలు చెబుతున్నాయి.. కానీ వ్యర్థాల దహనం ఇంకా కొనసాగుతూనే ఉంది’ అని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా కోర్టు.. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగడానికి వీల్లేదని పేర్కొంది.


ఈ అంశంపై 2017 నుంచి విచారణ జరుగుతోందని, కోర్టు పలు ఉత్తర్వులు జారీచేసిందని పిటిషనర్ల తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణ అన్నారు. వరికి ప్రత్యామ్నాయ పంట కోసం చూడాలని పంజాబ్, కేంద్రాన్ని కూడా కోర్టు కోరింది. వరిసాగు రాష్ట్ర నీటిమట్టాన్ని ఎలా నాశనం చేస్తోందో గుర్తించాలని వ్యాఖ్యానించింది. శీతాకాలం మొదలైదంటే చాలు ఢిల్లీలో వాయు కాలుష్యం అసాధారణంగా పెరిగిపోతుంది. పొరుగున ఉన్న హరియాణా, పంజాబ్‌లో రైతులు పంట వ్యర్థాలను ఈ సమయంలో దగ్ధం చేయడంతో పరిస్థితి దారుణంగా మారుతుంది. అయితే, కొన్నేళ్లుగా ఇది రాజకీయ ఆరోపణల అంశంగా మారిపోయింది.


ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గతంలో పంజాబ్, హరియాణాలోని ప్రత్యర్థి ప్రభుత్వాలు పంట అవశేషాలను తగులబెట్టడంపై కఠినంగా వ్యవహరించలేదని ఆరోపించింది. ప్రస్తుతం పంజాబ్‌లోనూ ఆ పార్టీ అధికారంలో ఉండటంతో గమ్మత్తైన స్థితిలో ఉంది. పంజాబ్‌లో వ్యర్థాలను తగులుబెట్టడం బాగా తగ్గిపోయిందని, బీజేపీ పాలిత హరియాణాపై నిందలు వేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్, హరియాణలో డీజిల్ బస్సులను నిషేధించడంలో ఆ ప్రభుత్వాలు విఫలమయ్యాయని, పంజాబ్‌ను బీజేపీ బలిపశువును చేస్తోందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. దీపావళి మర్నాడు నుంచి సరి-బేసి విధానం అమలుచేస్తామని కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన ప్రకటనను పబ్లిసిటీ స్టంట్‌గా అభివర్ణించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com