ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియాంక గాంధీకి ఇండోర్‌లో విచిత్రమైన అనుభవం,,,,పువ్వులు లేకుండా బొకే అందజేసిన కాంగ్రెస్ నేత

national |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2023, 10:09 PM

మధ్యప్రదేశ్‌‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీకి విచిత్రమైన అనుభవం ఎదురైంది. సభా వేదికపై ఓ కాంగ్రెస్ నేత చేసిన పని సభలో నవ్వులు పూయించింది. ఈ సమయంలో ప్రియాంక నవ్వు ఆపుకోలేకపోయారు. దీంతో వేదికపై ఉన్న మిగతా నాయకులు, సభకు హాజరైన జనం కూడా ఒక్కసారిగా ఘెల్లుమని నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ అక్కడ జరిగింది ఏంటంటే.. ప్రియాంక గాంధీని స్వాగతించే క్రమంలో ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి బొకేలను అందించి, ఫోటోలు దిగుతున్నారు.


ఈ క్రమంలో స్థానిక నాయకుడు దేవేంద్ర యాదవ్ ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. దానికి అందుకున్న ప్రియాంక.. బొకేలో పువ్వులు లేకపోవడంతో ఆశ్చర్యపోయారు. ఖాళీ బొకేను అతడికి చూపించి..పువ్వులు ఎక్కడని దేవేంద్ర యాదవ్‌ను నవ్వుతూ అడిగారు. అక్కడే ఉన్న మిగతా నాయకులు కూడా ఆమె నవ్వుతో శ్రుతి కలిపారు. అనంతరం ప్రసంగించిన ప్రియాంక గాంధీ.. ఈ బొకే ఉదంతాన్ని ప్రస్తావించారు. తాను ఇంతకుముందే ఓ బొకే అందుకున్నానని చెప్పిన ఆమె.. అది అచ్చంగా బీజేపీ నాయకులు ఇస్తున్న హామీల్లాగే ఖాళీగా ఉందని చెప్పడంతో జనం పగలబడి నవ్వారు. సోమవారం ఇండోర్‌లో జరిగిన ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.


వాడివేడిగా సాగుతోన్న ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన కాసేపు హాయిగా నవ్వుకునేలా చేసింది. మధ్యప్రదేశ్‌లో నవంబరు 25న ఎన్నికల పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటులో 14 నెలల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. ఈసారి మాత్రం ఆ తప్పు జరగకుండా అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తోంది. అటు, బీజేపీ కూడా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. మరి ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారో డిసెంబరు 3న తేలిపోనుంది.


‘ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ పాలించిన నేల ఇది.. న్యాయం, సత్యం, సుపరిపాలనకు ప్రసిద్ధి. అవినీతిని, దుర్మార్గపు పాలనను అంతమొందించడం ద్వారా ఇక్కడి ప్రజలు ఆ విలువలను పునరుద్ధరిస్తారు’ అని ప్రియాంక గాంధీ అన్నారు. అహల్యాబాయి హోల్కర్ 18వ శతాబ్దంలో దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండోర్‌ను పరిపాలించిన మరాఠా రాణి. ‘దీపావళికి ముందే ఉల్లి ధరలు పెరిగిపోవడంతో గృహిణులు ఆందోళన చెందుతున్నారు... ఎన్నికలు జరిగినప్పుడే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.. ఎల్పీజీ సిలిండర్ ధర ₹ 1,400కి పెరిగింది.. ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రభుత్వం దాని ధరను ₹ 400కి తగ్గించింది’ అని ప్రియాంక విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com