సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార పార్టీని దూషిస్తూ ఎక్కువగా అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వారు మిషనరీ గ్రూపుల్లాగా వ్యవహరిస్తున్నారని.. ఎవరి దగ్గరో డబ్బు తీసుకుని కొంతమంది చేస్తున్నారని.. కొందరు వ్యూస్ కోసం పోస్టులు పెడుతున్నారన్నారు. త్వరలో ఎన్నికలు రాబోతున్న పరిస్థితులను నియంత్రణలో ఉంచేందుకు మరింత మందిపై సైబర్ బుల్లీ షీట్లు తెరుస్తామన్నారు. సోషల్ మీడియాలో పొలిటికల్ సెన్సిటివ్ లాంగ్వేజ్, పొలిటికల్ అఫెన్సివ్ లాంగ్వేజ్ వాడుతున్న వారిని గుర్తించి సైబర్ బుల్లీ షీట్లు తెరుస్తామన్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులపై అసభ్యకర, అవమానకర రీతిలో పోస్టులు పెట్టిన వారి ఖాతాల్ని గుర్తించామన్నారు. చిత్రాలహరి, టీడీపీ కార్తీక్‌రెడ్డి, సమరసింహారెడ్డి, వైసీపీ మొగుడు తదితర అకౌంట్‌లు ఈ జాబితాలో ఉన్నాయన్నారు.
తమను ఎవరూ ఏమీ చేయలేరన్నట్లుగా వ్యవహరిస్తున్న వీరిని కొందరు ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా.. ఆస్తులూ జప్తు చేస్తామన్నారు. నకిలీ ఖాతాలు, మారుపేర్లతో పోస్టులు పెట్టేవారిని గుర్తించే సాంకేతికత తమ దగ్గర ఉందన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీల, అవమానకర పోస్టులపై యుద్ధం ప్రకటించామని.. అలాంటి పోస్టులు పెట్టేవారిపై గతంలో కంటే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీపై అభిమానంతో భవిష్యత్తును పాడు చేసుకోవద్దన్నారు.
ఇప్పటికే 2,972 మందిపై సైబర్ బుల్లీ షీట్లు తెరిచామన్నారు. 1,465 సోషల్ మీడియా అకౌంట్లను పర్యవేక్షిస్తున్నామన్నారు. వీటిలో 202 అకౌంట్ల నుంచి అసభ్యకర పోస్టులు పెట్టేవేనని.. అసభ్య, అభ్యంతరకర, అశ్లీల పోస్టులకు సంబంధించి ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపించామన్నారు. గతేడాది 1,450 పోస్టులు, ఈ ఏడాది ఇప్పటివరకూ 2,164 పోస్టుల్ని తొలగింపజేశామన్నారు. సీఐడీలోని సోషల్ మీడియా పర్యవేక్షణ విభాగం ద్వారా కొన్ని పోస్టులను, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ద్వారా మరికొన్ని పోస్టులను గుర్తించి తొలగించామన్నారు.
ప్రతిపక్షాల వారిపై పెట్టిన 45 అసభ్య పోస్టులను తీయించామని.. ఐదు కేసుల్లో లుకౌట్ నోటీసులు జారీ చేశామన్నారు. 45 కేసుల్లో ఎంఎల్‌ఏటీ ప్రొసీడింగ్స్ చేపటమన్నారు. విదేశాల్లో ఉంటూ అసభ్య పోస్టులు పెట్టే వారిని గుర్తించామని.. యూకే, యూఎస్‌ఏలకు సీఐడీ బృందాలను పంపామన్నారు. ఎంబసీ కార్యాలయాల్నీ అప్రమత్తం చేస్తునామన్నారు. అంతేకాదు న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన వారిపైనా చర్యలుకు సిద్ధమయ్యామని.. ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు సంజయ్ .