తిరుపతిలోని ఎస్వీ జూ పార్క్ ఎఫ్‌ఆర్వో (ఫారెస్టు రేంజ్ ఆఫీసర్) మాధవరావు ఏసీబీకి చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ యాప్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ అధికారుల బృందాలు ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు జరిపాయి. తిరుపతి జిల్లా చెర్లోపల్లి నివాసంలో ఉన్న మాధవరావు, అతని భార్యను ఇంటి నుంచి బయటకు రానీయకుండా దర్యాప్తు చేశారు. తిరుపతి, పుంగనూరు, వలపలవారి పల్లె, హైదరాబాద్‌లోనూ సోదాలు నిర్వహించారు.
చెర్లోపల్లిలో నిందితుడి భార్య పేరుతో జీ ప్లస్2 పెంట్ హౌస్, అవిలాలలో నిందితుడి పేరున జీ ప్లస్ 4 భవనం, వలపలవారి పల్లెలో జీ ప్లస్1 భవనం ఉన్నట్లు గుర్తించారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఏటవాకిలి గ్రామం, పుంగనూరు మండలం మెలిమిదొడ్డి, మాగంధపల్లె, రాగనపల్లె గ్రామాల్లో ఆస్తులు గుర్తించారు. రూ.1,64,900 నగదు, రూ.4 లక్షలు బ్యాంకు బ్యాలెన్స్, 1062 గ్రాముల బంగారు ఆభరణాలు సహా మొత్తం విలువ రూ.4,66,28,000గా నిర్ధారించారు.