చెత్త కుప్పలో వందల వేలు లక్షలు కాదు ఏకంగా కోట్లాది రూపాయలు దొరికితే... ఇలాంటివి సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, బెంగళూరులో చెత్త ఏరుకునే ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురయ్యింది. ఒకటా రెండా ఏకంగా రూ.25 కోట్ల విలువైన కరెన్సీ నోట్ల కట్టలు చూసి అతడు షాకయ్యాడు. అయితే, అది మనదేశ కరెన్సీ కాదు. నవంబరు 1న బెంగళూరు శివారులోని సల్మాన్ షేక్ (39) అనే వ్యక్తి చెత్త ఏరుకుంటుండగా ఓ పేపర్‌లో చుట్టి ఉన్న 23 కట్టల అమెరికన్ డాలర్లు అతడి కంటబడ్డాయి. దీంతో అవాక్కైన అతడు.. ఆ కరెన్సీ కట్టలను ఇంటికి తీసుకెళ్లి కొద్ది రోజులు అట్టిపెట్టుకున్నాడు.
తర్వాత తన యజమాని తౌహిదౌల్ ఇస్లామ్ అలియాస్ బప్పాకి అప్పగించాడు. ఈ విషయాన్ని స్వరాజ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన సామాజిక కార్యకర్త కలిముల్లాహ్‌కి బప్పా తెలియజేశాడు. ఇరువురూ బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానందను కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపై స్పందించిన సీపీ.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టాలని హెబ్బల్ పోలీసులను ఆదేశించారు. అమెరికా డాలర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ మొత్తం విలువ రూ.25 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
కరెన్సీపై కొన్ని రకాల రసాయనాలను పూసినట్లు గుర్తించారు. బ్లాక్ డాలర్ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠా ఈ కరెన్సీ నోట్లను చెత్తకుప్పలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఇవి నకిలీవా? ఒరిజినల్ డాలర్లా? అని గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వాటిని పంపినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, నవంబర్ 7 తెల్లవారుజామున హెబ్బాల్‌లోని బేతేల్ ఏజీ చర్చి సమీపంలోని బప్పా నివాసానికి ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కరెన్సీ గురించి అడిగినట్టు కలిముల్లా తెలిపారు.
‘ఐదుగురు వ్యక్తులు బప్పా ఇంటికి వచ్చి... వారిలో ఇద్దరు లోపలికి ప్రవేశించి అమెరికా కరెన్సీ గురించి అడిగారు. పోలీసులకు అప్పగించామని బప్పా చెప్పినా నమ్మలేదు.. ఎర్ర సూట్‌కేస్, ల్యాప్‌టాప్, డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)తో పాటు అతడ్ని ఇన్నోవాలో తీసుకెళ్లారు’ అని కలీముల్లా చెప్పారు. బయట ఉన్న ముగ్గురు బప్పా సహచరుడికి వెనుక నుంచి తుపాకీ పెట్టి బెదిరింపులకు పాల్పడినట్టు పేర్కొన్నారు. వాళ్లు తమలో తాము కన్నడలో మాట్లాడుకుని.. తనను హిందీలో కరెన్సీ గురించి అడిగారని బప్పా చెప్పినట్టు వివరించారు. అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో మాన్యతా టెక్ పార్క్ వద్ద బప్పాను వదిలిపెట్టారు. దీనిపై మాత్రం పోలీసులకు బాధితుడి ఇంత వరకూ ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.