పల్నాడు ప్రజల సాగు, తాగునీటి కష్టాలను తీర్చే వరికపూడిశెల ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. మాచర్లలో గుంటూరు రోడ్డులోని చెన్నకేశవకాలనీ ఎదురు స్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు రెండు దశల్లో పనులు పూర్తయితే మాచర్ల, వినుకొండ, యర్రగొండపాలెం నియోజకవర్గాలలోని 1.25 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు సాగునీరు, లక్షమందికి తాగునీరు అందనుంది. ఈ బృహత్తర ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు సీఎం వస్తుండటం పట్ల ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జలప్రదాతకు స్వాగతం పలుకుతూ మాచర్ల పట్టణంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. సీఎం పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్, వైయస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం మాచర్లలో సభకు జరుగుతున్న ఏర్పాట్ల తీరు పర్యవేక్షించారు.