భారత్, మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న మిజోరంలోకి మయన్మార్ నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. దీంతో రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చిన సైన్యానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజల మద్దతు గల మిలిటెంట్ గ్రూపు గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ రెండు వర్గాల మధ్య భీకర యుద్ధం చోటు చేసుకుంటోంది. ఈ దాడులు, ప్రతి దాడులతో విసిగిపోయిన మయన్మార్ ప్రజలు.. భయంతో ప్రాణాలు కాపాడుకునేందుకు సరిహద్దులు దాటి పొరుగున ఉన్న మిజోరంలోకి చొరబడుతున్నారు.
మయన్మార్ ఆర్మీ, ప్రజాస్వామ్య అనుకూల మిలిటెంట్ గ్రూప్ మధ్య ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు తీవ్ర కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లోని ప్రజలు చెందిన భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. దాదాపు 1400 మంది మోకాలిలోతు నీరు ఉన్న టియావు నది వంతెన మీదుగా నడుచుకుంటూ మిజోరం చేరుకున్నారు. భారత్, మయన్మార్ మధ్య గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం.. టియావు నది వంతెనపై నుంచి కాలినడకన వచ్చే శరణార్ధులను ఇరుదేశాలూ అడ్డుకోలేవు.
ఇక మయన్మార్ శరణార్ధులంతా మిజోరంలోని చంపై జిల్లా జోఖౌతార్ పట్టణంలోకి చేరుకుంటున్నారు. అయితే మయన్మార్ నుంచి శరణార్ధులుగా మిజోరం చేరుకున్న వారిలో ఒక వ్యక్తి చనిపోయాడు. మరో 16 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మయన్మార్ ఆర్మీ, మిలిటెంట్ల మధ్య జరిగిన కాల్పుల్లో వీరంతా గాయపడి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం అవుతోంది. తాజాగా వచ్చిన 1400 మందిని కలుపుకుంటే.. జోఖౌతార్ పట్టణంలో ఆశ్రయం పొందుతున్న మొత్తం మయన్మార్ శరణార్ధుల సంఖ్య 5604 కు పెరిగింది. దీంతో మొత్తంగా చంపై జిల్లాలో తలదాచుకుంటున్న మయన్మార్ శరణార్థుల సంఖ్య 10 వేలు దాటింది.
ఇక మయన్మార్‌లో తరచూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు పొరుగున ఉన్న మిజోరంలోకి అక్రమంగా వలస వస్తున్నారు. ఈ నేపథ్యంలో మిజోరం సీఎం జోరంథంగా నేతృత్వంలోని ప్రభుత్వం కూడా చూసీచూడనట్లు వదిలేస్తోంది. అయితే ఈ వరుస ఘటనలు దేశ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున మయన్మార్-భారత్ సరిహద్దు భద్రతను పర్యవేక్షిస్తున్న అస్సాం రైఫిల్స్ అప్రమత్తమైంది. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు, స్థానికంగా పేరున్న వ్యక్తులతో అస్సాం రైఫిల్స్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.
మయన్మార్‌లో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంతో అక్కడి నుంచి చిన్ కుకీ తెగకు చెందిన వారు భారీగా భారత్‌లోకి ప్రవేశించే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు.. ఇండియన్ ఆర్మీకి సమాచారం ఇచ్చింది. స్థానికేతరులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచిస్తున్నారు. మరోవైపు.. మిజోరంలోని వివిధ జిల్లాల్లో మయన్మార్ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్న వారి సంఖ్య 32 వేలకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 2021లో మయన్మార్ అధికారంలో ఉన్న పౌర ప్రభుత్వాన్ని కూలదోసిన అక్కడి సైన్యం అధికారాన్ని చేపట్టింది. దీంతో అప్పటి నుంచి సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపులను అంతం చేసేందుకు మయన్మార్ ఆర్మీ వైమానిక దాడులు చేస్తోంది. ఇక మయన్మార్‌లో అధికారంలో ఉన్న సైనిక ప్రభుత్వంతో గత కొన్నేళ్లుగా కచిన్ వేర్పాటువాదులు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కచిన్ వేర్పాటువాదులకు మయన్మార్ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరంలోనూ పోలింగ్ జరిగింది. మిజోరంలోని 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7 వ తేదీన ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఎన్నికలు ఉండటం, సరిహద్దు రాష్ట్రం కావడంతో మిజోరంలో భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో మయన్మార్ నుంచి శరణార్థులు వచ్చేందుకు వీలుపడలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఎన్నికల పోలింగ్ ముగియడంతో భద్రతను కాస్త తగ్గించారు. దీంతో మయన్మార్ నుంచి వలసలు కొనసాగుతున్నాయి.