రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మిజోరంలో ఒకే విడతలో ఎన్నికలు పూర్తి కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. ఇక మధ్యప్రదేశ్‌లో ఈనెల 17 వ తేదీన, రాజస్థాన్‌లో ఈ నెల 25 వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న హస్తం పార్టీ నేత అస్వస్థతతో ఆస్పత్రిలో చేరి కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన చనిపోయారు.
రాజస్థాన్ ఎన్నికలకు సరిగ్గా పది రోజుల సమయం ఉన్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న 75 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనార్ మరణించారు. గుర్మీత్ సింగ్ కూనర్.. నవంబర్ 4 వ తేదీన కరణ్‌పూర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం తన నియోజకవర్గం పరిధిలో ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
గుర్మీత్ సింగ్ కూనర్.. అనారోగ్యంతో నవంబర్ 12 వ తేదీన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న గుర్మీత్ సింగ్ కూనార్.. చివరికి తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన మృతిపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్‌లో గుర్మీత్ సింగ్ కూనర్ సెప్టిక్ షాక్, కిడ్నీ వ్యాధితో మరణించినట్లు ఉంది. హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు.
కరణ్‌పూర్ నియోజకవర్గం నుంచి గుర్మీత్ సింగ్ ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో గెలిచిన కూనర్ మంత్రిగానూ పనిచేశారు. ఈ క్రమంలోనే బీజేపీకి చెందిన సురేంద్రపాల్ సింగ్, పృథివాల్ సింగ్ సంధులను కూనర్ గత ఎన్నికల్లో ఓడించారు. ఈసారి కూడా ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. 75 ఏళ్ల కూనర్‌కు ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది.
రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉన్నాయి. రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు నవంబర్ 25 వ తేదీన జరగనున్నాయి. ఐదు రాష్ట్రాలతోపాటు డిసెంబర్ 3 వ తేదీన రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయితే తాజాగా కరణ్‌పూర్ స్థానం నుంచి బరిలో ఉన్న గుర్మీత్ సింగ్ కూనర్ అకాల మరణంతో 199 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాజస్థాన్‌లో గత 3 ఎన్నికల్లో కూడా 199 స్థానాల్లోనే ఎన్నికలు జరగడం గమనార్హం. 2013, 2018 లో కూడా రాజస్థాన్‌లోని 199 స్థానాలకు మాత్రమే ఓటింగ్ జరిగింది.