మూడు అంతస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి బ్రెయిన్ డెడ్ అయిన రెండున్నరేళ్ల చిన్నారి.. మరో ఇద్దరికి పునర్జన్మను ఇచ్చింది. ఆ బాలిక తల్లిదండ్రులు పెద్దమనసుతో అవయదానానికి ముందుకొచ్చారు. దీంతో ఇద్దరు పిల్లలకు ఆ చిన్నారితల్లి అవయవాలను అమర్చడం వల్ల వారి ప్రాణాలు దక్కాయి. అంతేకాదు, ఎయిమ్స్‌లో అతిపిన్న వయసులో గుండెను దానం చేసిన వ్యక్తిగా నిలిచింది. ఢిల్లీకి చెందిన రెండున్నరేళ్ల దివ్యాన్షి మూడు అంతస్తుల బిల్డింగ్పై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడింది. దీంతో ఆ పాపను చికిత్స కోసం తల్లిదండ్రులు ఎయిమ్స్‌కు తరలించారు.
కానీ, ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్దారించారు. దివ్యాన్షి అవయవాలు ఆరోగ్యంగా ఉండటం వల్ల తల్లిదండ్రులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. అవసరమైనవారికి అవయవాలను దానం చేస్తే వారి పునర్జన్మను ఇచ్చినట్టవుతుందని, వారిలో మీ కుమార్తెను చూసుకోవచ్చని వైద్యులు సూచించారు. అలాగే, ఆర్గాన్ రిట్రీవల్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ (ORBO) ద్వారా ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా ఇప్పించారు. దీంతో అవయవ దానం ప్రాముఖ్యతను ఆ తల్లిదండ్రులు గుర్తించారు. తమ బిడ్డను అవయవాలను దానం చేసేందుకు ఒప్పుకున్నారు.
దివ్వాన్షి నుంచి గుండెను సేకరించి.. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి పంపారు. గుండె సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న 8 నెలల చిన్నారికి శనివారం శస్త్రచికిత్స చేసి అమర్చారు. అలాగే, ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న 17 ఏళ్ల బాలికను రెండు కిడ్నీలను అమర్చి, కళ్లను సేకరించి ఐ బ్యాంక్లో భద్రపరిచారు. న్యూరోసర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ గుప్తా మాట్లాడుతూ.. ఎయిమ్స్‌లో గుండెను దానంచేసిన అత్యంత చిన్న వయస్కురాలిగా దివ్యాన్షి నిలించదన్నారు. ఇంటి బాల్కనీలో ఆడుకుంటూ కిందపడి.. తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. దేశంలో 12 ఏళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలలో ఎక్కువ మరణాలకు ఎత్తు నుంచి పడిపోవడమే కారణమని అన్నారు.
ఈ ముప్పు గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మేము గతేడాది ‘సేఫ్ బాల్కనీ, సేఫ్ చైల్డ్’ అనే క్యాంపెయిన్ ప్రారంభించామని, అయితే నగరంలో అలాంటి కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. బ్రెయిన్ డెడ్ చిన్నారి తండ్రి రాజ్ థాపా మాట్లాడుతూ.. ‘ఇలాంటి సంఘటన ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నాం. మేము మా బిడ్డను కోల్పోయాం.. సురక్షితమైన బాల్కనీల ప్రాముఖ్యతను మేం గ్రహించాం. ప్రతి ఒక్కరూ ఈ వాస్తవం గురించి తెలుసుకోవాలి.. వారి పిల్లలను సురక్షితంగా ఉంచాలని మేము కోరుకుంటున్నాం.. ఎయిమ్స్ ప్రారంభించిన ప్రచారాన్ని ప్రోత్సహించాలి’ అని పేర్కొన్నారు.
కాగా, గత మూడు రోజుల్లో ఢిల్లీ ఎయిమ్స్‌లో జరిగిన మూడో అవయవదానం ఇది. నవంబరు 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో నొయిడాకు చెందిన శశి అనే 48 ఏళ్ల మహిళ తలకు తీవ్రంగా గాయమైంది. దీంతో ఆమెను చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించారు. మర్నాడు ఆమెను వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. దీంతో ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. ఆమె కిడ్నీల్లోని ఒకదాన్ని ఎయిమ్స్లోని రోగికి, మరొకటి ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో రోగికి వైద్యులు అమర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa