తమ దేశం నుంచి భారత్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మాల్దీవుల సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కార్యాలయం నుంచి శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. ముయిజ్జు దేశాధ్యక్షుడి ప్రమాణస్వీకారం చేసిన మర్నాడే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో మాల్దీవుల అధ్యక్షుడు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సైన్యం ఉపసంహరణ విషయాన్ని మయిజు ప్రస్తావించినట్లు తెలిసింది. అనంతరం మాల్దీవుల నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. మహ్మద్ మయిజ్జు ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున రిజిజు హాజరయ్యారు.
సైన్యం ఉపసంహరణ అంశంపై విదేశాంగ శాఖ వర్గాలు స్పందిస్తూ.. అర్ధవంతమైన పరిష్కారంపై భారత్, మాల్దీవుల ప్రభుత్వ చర్చిస్తున్నాయని పేర్కొన్నారు. భౌగోళికంగా అత్యంత కీలకమైన సముద్ర ప్రాంతంలో ఉన్న మాల్దీవుల్లో దాదాపు 70 మంది వరకూ భారతీయ సైనికులు ఉన్నారు. రాడార్ల నిర్వహణ, విమానాల నిఘా వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఎకనమిక్ జోన్ల గస్తీ దళాలకు సహకరిస్తున్నాయి. విదేశీ దళాల ఉపసంహరణ డిమాండ్‌తో ఎన్నికల్లో గెలిచిన మయిజు.. అధికారంలోకి వచ్చిన వెంటనే తన హామీని అమలు చేస్తున్నారు.
ఆయన నాయకత్వంలోని మాల్దీవులు ఇక చైనావైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. వైద్య తరలింపు, డ్రగ్స్ అక్రమ రవాణా నిరోధం కోసం విమానాలను నడపడానికి మాల్దీవులలో ఉన్న భారతీయ సైనిక సిబ్బంది సమస్యను ఆ దేశ అధ్యక్షుడు ప్రస్తావించినట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మాల్దీవుల పౌరుల వైద్య తరలింపులో భారతీయ హెలికాప్టర్లు, విమానాల సహకారం, మారుమూల ద్వీపాలలో ఉండేటప్పుడు అంతర్జాతీయ పర్యాటకులకు అందిస్తున్న సేవలను ముయిజు గుర్తించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
మాల్దీవుల ప్రజల ప్రయోజనాల కోసం ఈ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం ద్వారా రెండు ప్రభుత్వాలు నిరంతర సహకారం కోసం ఆచరణీయ పరిష్కారాలను చర్చించాలని అంగీకరించారు. విదేశీ దళాలను మాల్దీవుల నుంచి వెనక్కి పంపుతామని మెహమ్మద్ మయిజు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి ప్రసంగంలో ఈ అంశాన్ని గుర్తుచేశారు. భారత్ పేరు చెప్పకుండా విదేశీ సైన్యాలు ఇకపై మాల్దీవుల్లో ఉండబోవని అన్నారు. ‘మా భద్రత విషయానికి వస్తే, నేను రెడ్ లైన్ గీస్తాను.. మాల్దీవులు ఇతర దేశాల రెడ్ లైన్లను కూడా గౌరవిస్తాయి’ అని ఉద్ఘాటించారు.
చైనా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారి షెన్ యికిన్ ప్రెసిడెంట్ ముయిజును మర్యాదపూర్వకంగా కలిసన రోజున భారత దళాలపై మాల్దీవుల ప్రకటన వచ్చింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మయిజుకు చైనా రాయబారి అభినందనలు తెలిపారు. ఆ పాలన కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని విశ్వాసం వ్యక్తం చేసినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa