ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ లాంఛ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఓపెన్ఏఐ సీఈవో సాం ఆల్ట్‌మన్‌ను కంపెనీ అర్ధంతరంగా తొలగించడం టెక్ ప్రపంచంలో కలకలం రేపింది. సామ్ ఆల్ట్‌మాన్‌పై వేటు వేసేందుకు కారణం ఏంటనేది ఓపెన్ఏఐ వెల్లడించాలని ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ కోరారు. ఆల్ట్‌మాన్ నిష్క్రమణపై మస్క్ స్పందిస్తూ సాం ఆల్ట్‌మాన్‌ను ఓపెన్ఏఐ నుంచి తొలగించడం తనను ఆశ్చర్యానికి లోను చేసిందని అన్నారు.
ఆల్ట్‌మాన్‌ను ఎందుకు తొలగించారనే సహేతుక కారణాలను ఓపెన్ఏఐ ప్రజల ముందుంచాలని, ఈ విషయంలో ప్రజలకు తెలియని విషయాలు ఏవో ఉన్నాయని మస్క్ సందేహం వ్యక్తం చేశారు. ఓపెన్ఏఐ ఏదో దాస్తున్నదని అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ఓపెన్ఏఐ ఎందుకు తన సీఈవోను తొలగించిందనేది ప్రజలకు తెలియచేయాలని అన్నారు. అడ్వాన్స్‌డ్ ఏఐకున్న శక్తి, దాని వల్ల పొంచిఉన్న ముప్పు దృష్ట్యా ఆల్ట్‌మాన్‌పై ఎందుకు వేటు వేయాల్సివచ్చిందనేది ఓపెన్ఏఐ ప్రజలకు బహిర్గతం చేయాలని మస్క్ పట్టుబట్టారు. కంపెనీ బోర్డు ఇలాంటి అనూహ్య నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనేది ప్రజలకు వివరించాలని ట్విట్టర్ వేదికగా మస్క్ కోరారు.