విశాఖలోని ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఫోరెన్సిక్, రెవెన్యూ, ఫైర్, ఫిషరీస్, పోలీసు విభాగాల నుంచి విచారణకు అధికారుల బృందం రంగంలోకి దిగనుంది. క్రైమ్, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్‌లతో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు సిటీ పోలీసు కమిషనర్ రవిశంకర్. ఈ ఘటనలో అనుమానితులను అదుపులోకి తీసుకుని లోతైన విచారణ చేపడతామన్నారు. క్రైమ్ నెంబర్ 186/2023 కింద అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసి.. హార్బర్ ఏసీపీకి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.
ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన అనుమానితుడుగా ఉన్న యుట్యూబర్ ఇచ్చిన సమాచారంపై ఆరా తీస్తున్నారు. మొత్తం 10 మంది అనుమానితులనీ అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్2లో డీసీపీ ఆనంద్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. యుట్యూబర్ కాల్ డేటా, హార్బర్‌లో అతని కదలికలపై విచారణ చేస్తున్నారు. వారం రోజులగా హార్బర్‌లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెబుతున్నారు.
మరోవైపు ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించడంతో హార్బర్‌లో ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు సుబ్బారెడ్డి. పోర్ట్,స్టీల్ ప్లాంట్, పోలీసులు సకాలంలో స్పందించారన్నారు. లేకపోయి ఉంటే ఆయిల్ ట్యాంకర్‌ల నుంచి ముప్పు ఉండేదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారని.. బోటు ఖరీదు రూ.30 నుంచి 50 లక్షలు అయినా అందులో 80 శాతం ప్రభుత్వం భరిస్తుందన్నారు. పాక్షికంగా దెబ్బ తిన్న బోటు యజమానులకు మేలు జరుగుతుందన్నారు సుబ్బారెడ్డి. గతం మాదిరిగా ఆలస్యం కాకుండా రోజుల వ్యవధిలో పరిహారం ఇస్తామన్నారు. టీడీపీ హయాంలో హుదూద్, తిత్లి మాదిరిగా ఆలస్యం లేకుండా పరిహారం అందిస్తామన్నారు.
మునిగిపోయిన బోట్లను తొలగించాలని పోర్ట్ అధికారులను కోరామని.. ఇతర బొట్లకు అడ్డం లేకుండా మునిగిన బోట్లను త్వరలో బయటకు తీస్తామన్నారు. మత్స్యకారుల కష్టాలను తెలుసుకోవాలని సీఎం పంపించారని.. అందుకే ఇక్కడికి వచ్చానన్నారు. కేవలం పరిహారం మాత్రమే కాదు ఇతర సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ ప్రమదానికికారకులపై చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారన్నారు. సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదన్న విషయంపై విచారణ చేపట్టాలని సీపీకి కోరామన్నారు.