దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లే లక్ష్యంగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈ ఇద్దరు నేతలను హత్య చేస్తామని.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఆ ఫోన్‌కాల్‌లో నిందితుడు తాను దావూద్ ఇబ్రహీం మాఫియా గ్యాంగ్‌కు చెందిన వాడిని అని చెప్పుకోవడం గమనార్హం. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ చేపట్టారు. అయితే గతంలో కూడా నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తామని ఫోన్ కాల్స్, బెదిరింపు ఈ మెయిల్స్ రావడం గమనార్హం.
నేరుగా ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం ఫోన్ చేసిన నిందితుడు.. ఈ వ్యాఖ్యలు చేయడంతో అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనికి తోడు ఆ వ్యక్తి తనను తాను ముంబై అండర్‌వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌లో సభ్యుడిని అని పరిచయం చేసుకున్నాడు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను హత్య చేసేందుకు ప్లాన్ చేయాల్సిందిగా దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ తనకు చెప్పిందని తెలిపాడు. వీరితోపాటు ముంబైలోని ప్రముఖ జేజే ఆస్పత్రిని కూడా పేల్చేస్తానని తీవ్ర హెచ్చరికలు చేయడం సంచలనం రేపుతోంది.
నిందితుడు చేసిన ఈ కాల్‌తో ముంబై పోలీసులు, నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగి.. గాలింపు చేపట్టారు. చివరికి ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. అనంతరం ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు రావడం తెలిసిందే. ఇటీవల భారత్‌లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా కూడా ప్రధాని మోదీని హత్య చేస్తామని.. ప్రపంచంలోనే అతిపెద్దదైన గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియంను బాంబులతో పేల్చివేస్తామని ముంబై పోలీసులకు బెదిరింపు ఈ మెయిల్స్ రావడం కలకలం రేగింది. రూ. 500 కోట్లు చెల్లించాలని ఆ దుండగుడు ఆ సమయంలో డిమాండ్ చేశాడు.
ఆ బెదిరింపు కాల్‌పై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ.. ఆ మెయిల్‌లు అన్నీ ఐరోపా నుంచి వచ్చినట్లు గుర్తించింది. అంతకుముందు గత ఏడాది ఆగస్ట్‌లో కేరళలో పర్యటించిన ప్రధాని మోదీపై ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరికలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా.. ఇంటి పక్క వ్యక్తిని కేసులో ఇరికించడానికే అతడు ఫేక్ కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.