చెన్నైకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఇద్దరు వృద్ధులు సహా ఆరుగురు ప్రయాణికులను.. వేరే విమానంలో పంపుతామని చెప్పి గ్రౌండ్ డ్యూటీ సిబ్బంది కిందకు దింపేశారు. అయితే, ఆ సమయంలో చెన్నైకి వెళ్లే ఇతర విమానాలు లేకపోవడంతో రాత్రంతా అక్కడే పడిగాపులు కాశారు. ఆరుగురి కోసం విమానం నడపడానికి ఇండిగో సంస్థ నిరాకరించడంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు. చివరకు సోమవారం ఉదయం వేరే విమానం ఎక్కి వెళ్లాల్సి వచ్చింది. తమకు విమానాశ్రయ హోటల్‌లో వసతి కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనను బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇండిగో వర్గాలు ధ్రువీకరించాయి. ఇద్దరు ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు 13 కి.మీ. దూరంలోని హోటల్‌కు వెళ్లిపోగా.. మిగతా నలుగురు లాంజ్‌లో ఉన్నారని తెలిపాయి. వీరందర్నీ సోమవారం ఉదయం వేరే విమానం ఎక్కించి, చెన్నైకు పంపినట్టు పేర్కొన్నాయి. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్‌సర్ నుంచి చెన్నై వయా బెంగళూరు ఇండిగో 6E478 విమానం ఆదివారం రాత్రి 9.30 గంటలకు కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకుంది. బెంగళూరుకు టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు దిగిపోగా.. చెన్నై వెళ్లాల్సినవారు ఆరుగురు మిగిలి ఉన్నారు.
ఇండిగో సిబ్బంది తీరుపై విస్తుపోయిన ప్రయాణికులు, తాము ఎదుర్కొన్న అసౌకర్యానికి చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ‘నేను సహా ఆరుగురు ప్రయాణీకులు బెంగళూరు టార్మాక్‌పై విమానంలో కూర్చున్నాం.. మీరు విమానం దిగాలని ఇండిగో గ్రౌండ్ సిబ్బంది నుంచి నా మొబైల్ ఫోన్‌కు కాల్ వచ్చింది. మరో ఫ్లైట్‌లో చెన్నైకి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది’ అని ఒక ప్రయాణికుడు తెలిపారు. మిగతా ఐదుగురికి కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ రావడంతో కంగారుగా విమానం దిగిపోయారు.
తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. ఎలాంటి సహాయం అందించకపోవడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విమానాశ్రయంలో ఇండిగో అసిస్టెంట్ మేనేజర్ లాయిడ్ పింటో వచ్చాడు.. కానీ అతను వృద్ధుల పట్ల కూడా సానుభూతి చూపకుండా దారుణంగా వ్యవహరించాడు. చివరకు వాళ్లు తమ తప్పును ఒప్పుకున్నా విమానాశ్రయ హోటల్‌లో తమకు వసతి కల్పించడానికి నిరాకరించారు’అని మరొక ప్రయాణికుడు వెల్లడించారు.