పాకిస్థాన్‌లోని కరాచీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం షాపింగ్ మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పదిమంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని కరాచీ మేయర్ సైతం ధ్రువీకరించారు. కరాచీలోని రషీద్ మిన్హాస్ రోడ్‌లో ఉన్న ఆర్జే షాపింగ్‌మాల్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం శనివారంతెల్లవారుజామున ఆర్జే షాపింగ్ మాల్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఆరు అంతస్తుల భవనంలోని నాలుగోఫ్లోర్‍లో షాపింగ్ మాల్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ షాపింగ్ మాల్‌లోనే శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.ప్రమాదం తాలూకూ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బిల్డింగ్‌లో నుంచి సుమారు 50 మందిని రక్షించారు. అయితే మంటల్లో చిక్కుకుని పదిమంది సజీవ దహనమయ్యారు. 22 మందికి గాయాలయ్యాయి.
అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని కరాచీ మేయర్ ముర్తజా వహాబ్ సిద్ధిఖీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కనీసం పదిమంది చనిపోయారన్న కరాచీ మేయర్..22 మందికి గాయాలైనట్లు తెలిపారు. మంటలను పూర్తిగా ఆర్పివేసినట్లు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన బహుళ అంతస్థుల భవనంలో షాపింగ్ సెంటర్లు, కాల్ సెంటర్లు, సాఫ్ట్‌వేర్ సంస్థలు నడుస్తు్న్నాయి. అయితే తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఉదయం ఆరున్నర గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వెంటనే ఎనిమిది ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను నియంత్రించినట్లు వెల్లడించారు.