ఏపీలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిపిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. మధ్యాహ్నం తరువాత విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పిటిషన్ దాఖలు అయింది. వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరుగబోతోంది. ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది.
వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో అక్రమాలకు తావిచ్చేవిధంగా ఉందని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ కోరింది. వాలటీర్ వ్యవస్థ మాటున ఎన్నికలను ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని, వారి ద్వారా చట్ట విరుద్ధంగా వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని ఆ పిటిషన్ లో పేర్కొంది. అధికారి వైసీపీ కార్యకర్తలనే ప్రభుత్వం వాలంటీర్లుగా నియమించిందని దీనికి అవకాశం కల్పించిన జీవో నెంబర్ 144ను సస్పెండ్ చేయకపోతే ప్రజలకు తీరని నష్టం జరుగుతందని ఆందోళన వ్యక్తం చేసింది. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆరోపించింది.