డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రాజకీయం రాజుకుంటుంది.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తాటిపాక బహిరంగ సభలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. లోకేష్ ఆలోచించకుండా, తెలియకుండా మాట్లాడటం సరికాదని హితవుపలికారు.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేపథ్యంలో తాటిపాక బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు పై అవినీతి ఆరోపణలు గుప్పించారు నారా లోకేష్.. దీనిపై స్పందించిన రాపాక.. లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలతో విమర్శనాస్త్రాలు సంధించారు.
నారా లోకేష్ ఒక పప్పు నాయుడని, పోరంబోకు అని తీవ్రంగా విరుచుకుపడ్డారు రాపాక.. తాను జనసేన పార్టీని మోసం చేసి బయటకు రాలేదని, ఒకవేళ తాను తప్పు చేస్తే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించాలి.. కానీ, తనని విమర్శించడానికి నువ్వెవడవురా..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. వెన్నుపోటు రాజకీయాలు నీ బాబుకి తెలిసినంతగా వేరెవ్వరికీ తెలియవన్న ఆయన.. ఒక దళితుడు ఇళ్లు కట్టుకుంటే ఇంతా వివక్షా..? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఎవడో వెధవ రాసిచ్చిన కాగితం చదవడం తప్ప తన గురించి లోకేష్ కి ఏం తెలుసని దుయ్యబట్టారు. మరోవైపు, లోకేష్ వ్యాఖ్యలను దళిత సంఘాల నుండి ఎమ్మార్పీఎస్ఎస్ నాయకులు తెన్నేటి కిషోర్ మాదిగ తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు కి నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని లేకుండా అట్రాసిటీ యాక్ట్ కింద ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.