దేశంలో కీలకమైన, వ్యూహాత్మకమైన ఇరవై ఖనిజ బ్లాకులను మోడీ ప్రభుత్వం వేలం వేస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించిన టెండర్ పత్రాల అమ్మకం బుధవారం ప్రారంభమైంది. ఖనిజ బ్లాకులను రెండు దశలుగా ఆన్‌లైన్‌లో వేలం వేస్తారు. పునరుద్పాదక ఇంధనం, రక్షణ, వ్యవసాయ రంగాల అవసరాలకు ఈ ఖనిజాలు కీలకంగా ఉన్నాయి. వేలం వేసే ఖనిజ బ్లాకులు, వేలం నిబంధనలు, సమయం తదితర వివరాలు ఎంఎస్‌టీసీ వేలం వేదికలో పొందవచ్చునని గనుల మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.
వేలం ద్వారా లభించే సొమ్మును ఆయా రాష్ట్రాలకు అందజేస్తారు. ఖనిజ బ్లాకుల వేలం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, దేశ భద్రత పెరుగుతుందని, భవిష్యత్తులో స్వచ్ఛమైన ఇంధనం కోసం చేసే ప్రయాణానికి మద్దతు లభిస్తుందని గనుల మంత్రిత్వ శాఖ వివరించింది. ‘కీలక, వ్యూహాత్మక ఖనిజాలకు చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం దిగుమతుల ద్వారా ఆ డిమాండ్‌ను తీర్చుకుంటున్నాం. దేశంలో ఖనిజాల లభ్యత తక్కువగా ఉంది. కొన్ని దేశాల్లో వాటి తవ్వకాలు, ప్రాసెసింగ్ తక్కువగా జరుగుతున్నాయి. దీంతో సరఫరాలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లిథియమ్, గ్రాఫైట్, కోబాల్ట్, టిటానియం వంటి ఖనిజాలపై ఆధారపడిన సాంకేతికత భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో ఉపకరిస్తుంది’ అని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
2030 నాటికి విద్యుచ్చక్తి స్థాపక సామర్ధ్యంలో 50 శాతాన్ని శిలాజ యేతర వనరుల నుండి పొందాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనివల్ల విద్యుత్ కార్లు, పవన-సౌర విద్యుత్ ప్రాజెక్టులు, బ్యాటరీ నిల్వ వ్యవస్థలకు డిమాండ్ ఏర్పడుతుంది. ఫలితంగా కీలక ఖనిజాలకు గిరాకీ వస్తుంది. మైనింగ్ నిబంధనల్లో సవరణలు చేయడం ద్వారా ప్రభుత్వం ఇటీవల 24 ఖనిజాలను కీలక, వ్యూహాత్మకమైనవిగా నోటిఫై చేసింది.