కేరళ శాసనసభ ఆమోదించిన ఎనిమిది బిల్లులను సుదీర్ఘకాలం పాటు ఆమోదించనందుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌పై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. రెండేండ్లుగా బిల్లులు ఎందుకు ఆమోదించలేదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను ప్రశ్నించింది. గవర్నర్ మంగళవారం రాష్ట్రపతికి ఏడు బిల్లులను పంపినట్టు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగానే గవర్నర్‌పై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ”రెండేండ్లుగా గవర్నర్ ఏం చేస్తున్నారు? బిల్లులు ఎందుకు ఆపారు?. మీరు ఎక్కువ కాలం బిల్లులు ఉంచడానికి ఎలాంటి కారణం చెప్పలేరు. ఈ చర్యను కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు.
ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవడంతో బిల్లులను రాష్ట్రపతికి పంపారు. చట్టాలను రూపొందించే శాసనసభల అధికారాల్లో జోక్యం చేసుకునే విధంగా గవర్నర్ అధికారాలను దుర్వినియోగం చేయరాదు. గవర్నర్‌కు రాజ్యాంగ బాధ్యత ఉంది. అది నెరవేరలేదని తేలితే కోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ప్రజలే మనల్ని అడుగుతారు” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ అమోదించిన బిల్లులకు అంగీకారం తెలపకుండా గవర్నర్ ఉద్దేశపూర్వక జాప్యాన్ని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం, బిల్లులపై గవర్నర్లు నిర్ణయాలు తీసుకునే విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది.