రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం అందించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేయాలని ఉరవకొండ వైయస్‌ఆర్ సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. పయ్యావులది దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర అని దుయ్యబట్టారు. ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్‌ను బెదిరించేలా పయ్యావుల కేశవ్ వ్యవహరిస్తున్నాడని, అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల 30 వేల దొంగ ఓట్లను నమోదు చేయించాడన్నారు. కర్ణాటకలో నివసిస్తున్న వారి ఓట్లు ఉరవకొండ నియోజకవర్గంలో ఎందుకు ఉండాలి..? దొంగ ఓట్లను తొలగిస్తే తప్పేంటి..? అని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు.