తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశికి ఆన్‌లైన్‌లో టికెట్లు దొరకని భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 4.25 లక్షల టికెట్లు జారీచేస్తామని.. దీని విధివిధానాలపై చర్చిస్తున్నామన్నారు. ఒకేసారి టికెట్ల జారీ ప్రారంభించి 10 రోజులుకు ఒకేసారి ఇద్దామనుకుంటున్నామని 2,3 రోజుల్లో పూర్తవుతాయన్నారు ఈవో. ఇలా చేస్తే క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం ఉండదని.. రెండేళ్లుగా అలాగే చేశామని తెలిపారు. అలాగే రెండో ఆప్షన్ కింద.. ఏ రోజుకు ఆ రోజు (ఒక రోజు ముందు) టికెట్లు జారీ చేయొచ్చని.. కాకపోతే దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఈ రెండు విధానాలపై ఆలోచన చేస్తున్నామని.. మూడో ఆప్షన్ మూడు రోజులకు కలిపి ఒకసారి.. '22, 23, 24 తేదీలకు లక్షా 20 వేలు..25 ఓపెన్ చేసి 26, 27, 28 ఇచ్చి.. మళ్లీ 29 ఓపెన్ చేసి 30, 31, 1న ఇచ్చే అంశంపై ఆలోచన చేస్తున్నాం' అన్నారు.
ఆఫ్‌లైన్‌లో లక్కీ డిప్ సేవా టికెట్లు పొందిన భక్తులకు ఎస్ఎంఎస్ రావడం లేదని భక్తులు ఫిర్యాదు చేశారు.. ఆఫ్‌లైన్‌లో లక్కీ డిప్‌లో సేవా టికెట్లు పొందిన భక్తులకు ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు. ప్రతిరోజు నిర్ణీత సంఖ్యలో సేవా టికెట్లు విడుదల చేయడం వీలుకాదన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు అక్షింతలు అందిస్తున్నామన్నారు ఈవో. దర్శనానంతరం భక్తులకు అక్షింతలు అందించే విషయమై ఆగమ సలహామండలితో చర్చిస్తామన్నారు. విశాఖపట్నంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే అన్ని ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశం త్వరలో కల్పిస్తామన్నారు.
వరంగల్‌లోని పురాతన శ్రీ రంగనాథ స్వామి ఆలయం జీర్ణోద్ధరణకు శ్రీవాణి ట్రస్ట్ నుండి సహాయ సహకారాలు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబరు 23, 24వ తేదీల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ లేదని.. తిరుమలలో వసతి కొరకు సీఆర్‌వో వద్ద పేర్లు రిజిస్టర్ చేసుకుని పొందవచ్చన్నారు. తిరుపతిలో ప్రైవేట్ వసతి చాలా ఉందని.. ఆన్‌లైన్‌లో లక్కీడిప్ సేవా టికెట్లు ఇవ్వడం వీలుకాదు అన్నారు. లక్కీడిప్ ద్వారా మాత్రమే విడుదల చేయడం జరుగుతుందని.. పోటు కార్మికులతో చర్చించి లడ్డూ నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండడం వలన శ్రీవారి దర్శనానికి క్యూ లైన్‌లలో తోపులాట స్వల్ప తోపులాట జరుగుతూ ఉంటుందన్నారు ఈవో. క్యూలైన్లను నిరంతరాయంగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటామని.. వృద్ధులు, దివ్యాంగుల షెడ్‌లో కుర్చీలను మారుస్తామన్నారు. తిరుమలలో లగేజీ కౌంటర్ల దగ్గర డబ్బులు డిమాండ్ చేయడంపై ఈవో స్పందించారు. ఇలాంటి సంఘటనలపై భక్తులు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. 'మా అధికారులు మీతో మాట్లాడి వివరాలు తీసుకుని సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం' అని ఓ భక్తుడికి సూచించారు.
శ్రీవారి ఆలయ మహద్వారం మహద్వారం వద్ద నిరంతరాయంగా నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని.. కల్యాణకట్టలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. లడూడు నాణ్యత పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయాలని అధిక సంఖ్యలో భక్తులు కోరారన్నారు. తద్వారా వారికి నిర్దేశించిన తేదీ, సమయానికి దర్శనానికి వస్తున్నారని.. ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం వీలుకాదన్నారు. శ్రీవారి ఆలయంలో వేద పారాయణం మాత్రమే ఉంటుంది. ఏకాంత సేవలో మాత్రమే అన్నమయ్య సంకీర్తనలు ఆలపించడం జరుగుతుందన్నారు.