ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఈ పార్టీ దారుణంగా ఓటమిపాలైంది. డిప్యూటీ సీఎం సహా భూపేశ్ బఘేల్ సర్కారులో 9 మంది మంత్రులకు పరాజయం తప్పలేదు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ అయితే, కేవలం వంద కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఈసీ గణాంకాల ప్రకారం.. అంబికాపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సింగ్ దేవ్‌కు తాజా ఎన్నికల్లో 90,686 ఓట్లు వచ్చాయి.
ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాజేశ్ అగర్వాల్‌కు 90,780 ఓట్లు పోలయ్యాయి. అంటే కేవలం 94 ఓట్ల తేడాతో సింగ్ దేవ్ ఓడిపోయారు. ఇక, తాజా ఫలితాల్లో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బ్రిజ్‌మోహన్ అగర్వాల్ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. రాయ్‌పుర్ దక్షిణ నియోజకవర్గంలో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 67,179 ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు, కాంకేర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశారాం నేతమ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై కేవలం 16 ఓట్ల తేడాతో గెలిచారు.