తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని ప్రజల్ని జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించండి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు చేరిస్తే ప్రాణ నష్టం లేకుండా ఉంటుంది. పాత ఇళ్లలో ఉండే వారిని ఒప్పించి బయటికి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించండి.. పోలీసులు బాగా చేశారనేది వినిపించాలి అంటూ జిల్లాల పోలీసులకు డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. తుఫాను ప్రభావిత కోస్తా తీర జిల్లాల ఎస్పీలతో ఆయన నిరంతరం ఫోనులో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని టెక్ టవర్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని అందుకు అనుగుణంగా దిశా నిర్దేశం చేశారు. ఒక్క ప్రాణం కూడా పోవడానికీ వీల్లేదని, పశు సంపదను సైతం రక్షించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎప్, రెవిన్యూ ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకొంటూ నిర్వాసితులకు అన్ని విధాలా అండగా నిలవాలని డీజీపీ ఆదేశించారు.