మిచౌంగ్ తుఫాన్ హెచ్చరికలతో నెల్లూరు జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. పొదలకూరు మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమేరకు వరినార్లు నీటమునిగాయని, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. వరినార్లు దెబ్బతిన్న రైతులకు వెంటనే సబ్సిడీపై విత్తనాలు అందజేస్తామని, నష్టపరిహారాన్ని పూర్తిగా అంచనా వేసి అన్నదాతను ఆదుకుంటామన్నారు. లోతట్లు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని, కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చూస్తున్నారని చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని ఒక్క కుటుంబానికి రూ.2500, ఒంటరి వారికి రూ.వెయ్యి ఆర్థిక సాయం అందజేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇళ్లు నీట మునిగిన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి ఉచితంగా 25కేజీల బియ్యం, పామాయిల్ ప్యాకెట్, కందిపప్పు కేజీ, ఎర్రగడ్డలు కేజీ, ఉర్లగడ్డలు కేజీ చొప్పున అందించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బలంగా వీచిన ఈదురుగాలుల వలన విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, సెల్‌ఫోన్‌ల నెట్‌వర్క్ సమస్యలు ఏర్పడి కమ్యూనికేషన్స్ దెబ్బతిన్నాయని ఆయన వివరించారు.