ఓటర్ల జాబితా పరిశీలకులుగా నియమించిన ఐఏఎస్ అధికారి మురళీధర్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు బంధువని, అధికార వైసీపీ పార్టీతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్న ఆయన్ను ఎన్నికల పరిశీలకునిగా తప్పించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ షరీఫ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆయనతోపాటు, టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎల్పీ సెక్రటరీ కోనేరు సురేష్, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు కలిసి ఫిర్యాదు చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీగా డిసెంబరు 9గా ఎన్నికల సంఘం నిర్ణయించిందని, కానీ భారీ వర్షాల కారణంగా జనజీవనానికి అంతరాయం ఏర్పడిన దృష్ట్యా ఆ గడువును వారం రోజులపాటు పొడిగించాలని కోరారు. గంపగుత్తగా వచ్చే ఫారం 7లను ఆపాలని, బల్క్ ఫారం-7లతో తీసేసిన వివరాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అధికార పార్టీకి అనుగుణంగా దొంగ ఓట్లు చేర్చడానికి, ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ఎస్‌ఈసీని కోరారు.