ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కో రోజా శనివారం కాకినాడ జిల్లా సామర్లకోటలోని భీమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి రోజా. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఆడండి, పాడండి, ఎంజాయ్ చేయండి అంటూ పిలుపునిచ్చారు.
మరోవైపు ఏపీలోని క్రీడాకారుల కోసం ఆడుదాం ఆంధ్రా పేరుతో ప్రభుత్వం టాలెంట్ సెర్చ్ చేస్తోంది. ఇదే క్రమంలో యువతలో క్రీడలను ప్రోత్సహించే విధంగా ఇప్పటికే 9 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. మరో రెండు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఏపీ వ్యాప్తంగా క్రీడల్లో నైపుణ్యం ఉన్న యువతను వెలికి తీసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతోంది. సుమారు 50 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.ఈ టోర్నీ కోసం ఏపీ ప్రభుత్వం రూ.41.43 కోట్ల విలువైన దాదాపు 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను సిద్ధం చేసింది. అధికారులు వీటిని ఇప్పటికే జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలకు తరలించారు.
ఇక ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ద్వారా ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న యువత తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వారికి అవసరమైన కిట్లను ప్రభుత్వమే సమకూరుస్తుంది. అలాగే ఈ టోర్నీని ప్రజలందరూ లైవ్‌లో చూసేలా ప్రత్యక్ష ప్రసారం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లైవ్ ఇచ్చేందుకు వీలుగా ఆడుదాం ఆంధ్ర పేరుతో వెబ్ సైట్‌ను రూపొందించింది. అలాగే అవసరమైన సిబ్బందిని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు. ఆడుదాం ఆంధ్రా సైట్లో గ్రామ,వార్డు సెక్రటేరియట్లలో జరిగే మ్యాచ్‌ల వివరాలు, స్కోర్లను అప్‌లోడ్ చేయనున్నారు.