మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఆడుదాం ఆంధ్రా పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగిన ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, అద్భుతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఏపీ సర్కారు.. ఈ ఈవెంట్ స్టార్ట్ చేసింది. సుమారు 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే గ్రామ,వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఈ టోర్నీ కోసం ఏపీ ప్రభుత్వం రూ.41.43 కోట్ల విలువైన 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను క్రీడాకారుల కోసం సిద్ధం చేసింది.
మరోవైపు యువతలో దాగి ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహించే విధంగా ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. ఇప్పటి వరకూ 9 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న ఏపీ సర్కారు.. మరో రెండింటితో చర్చలు జరుపుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ లీగ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, ప్రైమ్ వాలీబాల్ లీగ్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్, పీవీ సింధు, ఆంధ్రా ఖో ఖో అసోసియేషన్, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్, ఆంధ్రా వాలీబాల్ అసోసియేషన్ తో ఒప్పందాలు చేసుకుంది. ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌తో చర్చలు సాగుతున్నాయి. ఈ సంస్థల నేతృత్వంలో ఏపీ వ్యాప్తంగా టాలెంట్ సెర్చ్ నిర్వహించనున్నారు. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు పాల్గొనవచ్చు. క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో మారథాన్, యోగా, టెన్నికాయిట్‌తో పాటుగా ప్రాంతీయ క్రీడలను ప్రోత్సహిస్తారు. మొత్తం ఐదు దశల్లో పోటీలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఇలా ఐదు దశల్లో పోటీలు నిర్వహిస్తారు.