విజయనగరం వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తవలస రైల్వేస్టేషన్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా మార్చనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఏపీ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. వికసిత భారత్ సంకల్పయాత్రలో భాగంగా శనివారం అశ్వినీ వైష్ణవ్ విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగానే కొత్తవలస రైల్వేస్టేషన్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇక కేకే లైన్‌గా పిలిచే కొత్తవలస కిరండోల్ లైన్‌ను కూడా డబుల్ లైన్‌గా మార్చనున్నట్లు వెల్లడించారు. ఫలితంగా మరిన్ని రైళ్లు ఆ మార్గంలో నడుస్తాయని రైల్వే మంత్రి వివరించారు. కాశీ వెళ్లే రైలును ఎస్.కోట మీదుగా నడుపుతామన్న రైల్వేశాఖ మంత్రి.. విశాఖ బెనారస్ రైళ్ల ఫ్రీకెన్సీని పెంచనున్నట్లు తెలిపారు. కేంద్రంలోని నరేంద్రమోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. బీజేపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చినట్లు వివరించారు. ఉజ్వల్ పథకం కింద అర్హులైన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామన్న కేంద్రమంత్రి.. కొవిడ్ సమయంలో కేంద్రం తీసుకున్న చర్యలను వివరించారు. రేషన్ పంపిణీతో పాటుగా ఫ్రీగా కొవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకప్పుడు మంచినీటి కోసం పలుప్రాంతాల్లో అనేక ఇబ్బందులు పడేవారన్న ఆయన.. మోదీ వచ్చాక ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీటిని అందించే కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఇక ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ కార్డు ద్వారా పేదలకు ఐదు లక్షల వరకూ ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఏపీలో రైల్వేల అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 8 వేల 406కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ కార్యాలయం కోసం భూ కేటాయింపు సమస్యగా మారిందన్న ఆయన..ఇందుకోసం 52 ఎకరాల భూమి అవసరం అవుతుందని అన్నారు. డిజైన్లుతో పాటు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయన్న రైల్వే మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వం భూమికేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు .. కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా ఉజ్వల యోజన పథకం, ఆధార్ నమోదు, ఆయుష్మాన్ భారత్ పథకం, పీఎంకిసాన్, కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేస్తారు.