తమ డిమాండ్లని ప్రభుత్వానికి చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఏపీ వ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాలతో పాటు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని ఏపీ అంగన్వాడీ వర్కర్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ), అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్(ఎఐటీయూసీ), ప్రగతి శీల అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(ఐఎఫ్‌టీయూ) యూనియన్లు ప్రకటించాయి. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చనందుకు, నాలుగున్నరేళ్లుగా తమ సమస్యలు పరిష్కరించనందుకు నిరసనగా డిమాండ్ల సాధనకు మంగళవారం నుంచి మూకుమ్మడిగా సమ్మెబాటపడుతున్నట్లు తెలిపాయి. అలాగే తెలంగాణ కన్నా ఏపీలో అదనంగా వేతనాలు పెంచాలని నిరవధిక సమ్మెలో అంగన్వాడీ వర్కర్స్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు ఏలూరు జిల్లాలోని నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ భద్రతతో కూడిన డిమాండ్స్ పరిష్కారానికి రిలే నిరసన దీక్షలకు అంగన్ వాడీ వర్కర్స్ , హెల్పర్స్ దిగారు. రాష్ట్ర కమిటీ ఆదేశాలతో అంగన్వాడీ సెంటర్లను మూసివేసి సమ్మెలో భారీగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేసి, రిటైర్మెంట్ బెనిఫిట్ పెంపుదల, టీఏ బిల్లులు, బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నాయి.