ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీం కోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ కేసులో 17 ఏపై తీర్పు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈరోజు సుప్రీంలో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందు ఫైబర్ నెట్ కేసు విచారణకు వచ్చింది. స్కిల్ కేసులో 17 ఏపై తీర్పు వెలువరించాల్సి ఉన్నందున పైబర్ నెట్ కేసును జనవరి 17కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతవరకూ చంద్రబాబుపై ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. పైబర్ నెట్ కేసు గురించి కూడా చంద్రబాబు మాట్లాడకుండా నిలువరించాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది రంజిత్ కుమార్ విజ్ణప్తి చేశారు. చంద్రబాబు మాట్లాడటం లేదని ఆయన తరపు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూథ్రా స్పష్టం చేశారు. ఏఏజీ, డీజీపీలు మాత్రమే ఢిల్లీ, హైదరాబాద్‌లలో విలేకరుల సమావేశం పెట్టి కేసు గురించి మాట్లాడుతున్నారని సిద్ధార్థ లూథ్రా తెలిపారు. కేసు గురించి ఎవరేం మాట్లాడారో అఫిడవిట్ దాఖలు చేయాలని ఇరు తరపు న్యాయవాదులను ఆదేశిస్తూ.. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.