మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గురువారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో వరి, చెరుకు, పొగాకు, మినుము, పెసర, పత్తి, మిర్చి, ఉద్యాన పంటలు 60 శాతం పైగా దెబ్బతిన్నాయని, జాతీయ విపత్తుగా గుర్తించాలని కోరారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ పంట నష్ట నమోదులో రైతులు, కౌలు రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎకరాకు 40 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు.