వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు గత టీడీపీ ప్రభుత్వంలో అందించిన 27 పథకాలను రద్దు చేసిందని ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని సుందర్‌నగర్‌లో గురువారం రాత్రి ఎమ్మెల్యే స్వామి బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి వేల కోట్ల రూపాయల సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీదని ధ్వజమెత్తారు. కార్పొరేషన్‌ల ద్వారా టీడీపీ హయాంలో అందించిన బ్యాంకు సబ్సిడీ రుణాలను రద్దుచేసి వైసీపీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల వారిని మరింత అణగదొక్కిందన్నారు. అందుకు నిదర్శనమే బెస్ట్‌అవైలబుల్ పాఠశాలలు, అంబేద్కర్ విదేశీవిద్య పథకం రద్దని చెప్పారు. జగనన్న లేఅవుట్‌ల పేరిట ఎస్సీ, ఎస్టీలకు చెందిన వేల ఎకరాల అసైన్డ్ భూములను వైసీపీ లాగేసుకుందని విమర్శించారు. ఎస్సీ నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా ఉండి, ఆ నియోజకవర్గాల్లో నిర్మితమవుతున్న అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి, దళితులు భవిష్యత్‌ను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు, ఉద్యోగుల ప్రమోషన్‌లో రిజర్వేషన్లు అమలు చేయకుండా రాజ్యాంగ స్ఫూర్తికి జగన్‌రెడ్డి తూట్లు పొడిచారని స్వామి విమర్శించారు. పొన్నలూరులో గత ప్రభుత్వంలో ఐదు కోట్ల రూపాయల నిధులు ఎస్సీ గురుకుల పాఠశాల నిర్మాణానికి మంజూరు చేయిస్తే, వైసీపీ వచ్చాక ఆ పనులను అర్ధంతరంగా నిలిపివేసిందన్నారు. సింగరాయకొండ మండలంలో అన్ని గ్రామాల్లో టీడీపీ హయాంలోనే సీసీరోడ్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించామని గుర్తు చేశారు. సుందర్‌నగర్‌లో ఉన్న ఎయిడెడ్ పాఠశాలను మూసివేసి ఎస్టీ విద్యార్థులకు విద్యను దూరం చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ రద్దుచేసిన పథకాలను పునరుద్ధరిస్తామని హామీఇచ్చారు. అనంతరం ఇంటింటికి తిరిగి ష్యూరిటీ పథకాలను వివరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేల్పుల శింగయ్య, నాయకులు చీమకుర్తి కృష్ణ, షేక్ సందానిబాషా, సన్నెబోయిన శ్రీనివాసులు, కూనపరెడ్డి సుబ్బారావు, గాంధీచౌదరి, రామారావు, గుదె వెంకటేశ్వర్లు, అబ్దుల్ సుబాన్, యస్ధాని, సనావుల్లా, కళ్లగుంట నరసింహ, శేషారావు, రవిశంకర్‌రెడ్డి, రావులపల్లి వెంకటరావు, మోటుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.