విద్యాప్రమాణాలు గాలికి వదిలేసి.. విద్యావ్యవస్థను సీఎం జగన్‌రెడ్డి పాతాళానికి నెట్టేశాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్ అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘నాలుగున్నరేళ్లలో జగన్‌రెడ్డి రాష్ట్ర విద్యారంగంలో సాధించింది శూన్యం. నాడు-నేడు పేరుతో అవినీతికి పాల్పడి.. ఇంటర్ బోర్డుకి చెందిన కోట్లరూపాయలు కాజేసి బోర్డుని జగన్ నిర్వీర్యం చేశాడు. 60 వేల ఉపాధ్యాయ పోస్టుల్లో ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ఉపాధ్యాయులకు ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని విస్మరించి.. వారిని మద్యం దుకాణాలవద్ద కాపలా పెట్టాడు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లుగా తనపార్టీ...తనవర్గం వారిని నియమించి యూనివర్శిటీలను వైసీపీ కేంద్రాలుగా మార్చాడు. అంగన్ వాడీ కేంద్రాలకు అందించే చిక్కీల కొనుగోళ్లలో రూ.200కోట్లు.. 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్‌ల కొనుగోళ్లలో రూ.221కోట్లు కొట్టేశాడు. విద్యానాణ్యతా ప్రమాణాల్లో టీడీపీ ప్రభుత్వంలో దేశంలో 3వ స్థానంలో ఉన్న ఏపీ.. జగన్ హాయాంలో 19వ స్థానానికి పడిపోయింది. టీడీపీ ప్రభుత్వంలో పదోతరగతి ఉత్తీర్ణతాశాతం 92.9 శాతముంటే, జగన్ హాయాంలో అది 69.76కు పడిపోయింది. ఏపీలో 84లక్షల మంది విద్యార్థులుంటే కేవలం 44లక్షల మందికే అమ్మఒడి అందించి, మిగిలిన విద్యార్థులను విద్యకు దూరం చేశాడు. నాలుగేళ్లలో మూడేళ్లు అమ్మఒడి కింద రూ.25 వేల కోట్లు అందించి... నాన్నబుడ్డి ద్వారా లక్షకోట్లు పేదల నుంచి జగన్ కొట్టేశాడు’’ అని మహమ్మద్ షరీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.