ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి.. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వానలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. రాబోయే 24 గంటల్లో.. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఆదివారం నెల్లూరు జిల్లా రాపూరు, నెల్లూరు, కావలి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా తొట్టెంబేడు, తిరుపతి జిల్లా తడ, కడప జిల్లా కోడూరు, చిత్తూరు జిల్లా పాలసముద్రం, తిరుపతి, అన్నమయ్య జిల్లా మదనపల్లె, తిరుపతి జిల్లా గూడూరు, అన్నమయ్య జిల్లా పుల్లంపేటలో వర్షం కురిసింది. మరోవైపు వర్షాల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీల తక్కువగా నమోదు కావడంతో.. అక్కడ ప్రజలు చలి దెబ్బకు వణికిపోతున్నారు.
ఇదిలా ఉంటే.. మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులు జరుగుతున్నప్పటికి చలిలో ఎటువంటి మార్పులేదు. ఆదివారం పాడేరులో 14 డిగ్రీల కనిష్ఠ, 23 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చింతపల్లిలో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగి, తాజంగి, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తున్నది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం పది గంటల వరకు మంచు వీడడంలేదు. కొన్ని ప్రాంతాల్లో 11 గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదు.
ఉత్తరాది నుంచి చలి గాలులు వీస్తుండడంతో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. చలి తీవ్రత పెరుగుతుంది. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల వరకు ఎండ ఉంటే.. ఆ తతర్వాత చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో చలి మంటలు వేసుకుంటూ, ఉన్ని దుస్తులు ధరిస్తూ ఏజెన్సీ వాసులు చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన్యం ప్రాంతమే కాదు.. మిగిలిన జిల్లాల్లో కూడా పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. రోడ్లపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. లైట్లు వేసుకుని వెళుతున్నా.. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదంటున్నారు. రోడ్లపై వెళ్లే సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.