దేశంలో మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం.. కేరళలో జేఎన్.1 కొత్తరకం వేరియంట్ వెలుగులోకి రావడంతో ఆందోళన కలిగిస్తోంది. చాలా రోజుల తర్వాత దేశంలో ఐదు కరోనా మరణాలు సోమవారం నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. కేరళలోనే నలుగురు ఉన్నారు. దేశంలో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ సోమవారం కీలక సూచనలు చేసింది. ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్య కేసుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
'కోవిడ్ టెస్టులకు ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని, టెస్టుల సంఖ్యను పెంచాలని తెలిపింది. జిల్లాల్లోని కేసులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను INSACOG ప్రయోగశాలలకు పంపాలని కోరింది. ‘కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది.. అంటువ్యాధి ప్రవర్తన భారత వాతావరణ పరిస్థితులు, ఇతర సాధారణ వ్యాధికారక వ్యాప్తిలో స్థిరపడుతుంది కాబట్టి, కరోనా పరిస్థితిపై జిల్లా స్థాయిల వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం’ అని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.
రాబోయే పండుగల సీజన్‌ను ఉటంకిస్తూ.. శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధుల వ్యాప్తి పెరిగే ప్రమాదాన్ని తగ్గించడానికి అవసరమైన ప్రజారోగ్య చర్యలు, ఇతర ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది అని కేంద్రం పేర్కొంది. అన్ని ఆరోగ్య సౌకర్యాలలో జిల్లాల వారీగా ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యం, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల కేసులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, వాటిని నివేదించాలని రాష్ట్రాలను కోరింది.
‘అధిక సంఖ్యలో ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించాలి. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను భారతీయ SARS COV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) ప్రయోగశాలలకు పంపాలి.. తద్వారా దేశంలో ఏవైనా కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించడానికి వీలు కల్పిస్తుంది’ అని రాష్ట్రాలకు కేంద్రం చెప్పింది. అలాగే, సామాజిక ఆవగాహనను కలిగించడానికి రాష్ట్రాలు ప్రయత్నించాలని చెప్పింది.
మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల, JN.1 కోవిడ్ ఉప-వేరియంట్ నేపథ్యంలో వైరస్ అభివృద్ధి చెందుతోందని, మార్పులకు గురవుతోందని పేర్కొంది. బలమైన నిఘా, భాగస్వామ్యంతో వైరస్ నియంత్రణ కొనసాగాలని సభ్యదేశాలను కోరింది. అటు, గత నెలలో చైనా ఉత్తర ప్రాంతంలో అంతుచిక్కని కొత్తరకం న్యూమోనియా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లలు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరినట్టు నివేదికలు వెలువడ్డాయి. అయితే, ఇది కొత్త రకం వైరస్ కాదని.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా తెలియజేసింది.